కరోనా వేళ.. పాజిటివ్ గా ఎలా ఉండాలి?

by  |
కరోనా వేళ..  పాజిటివ్ గా ఎలా ఉండాలి?
X

దిశ వెబ్ డెస్క్: ఏ సోషల్ మీడియా సైట్ లోనైనా .. కరోనా అప్ డేట్సే.. ఏ చానెల్ తిప్పినా.. కరోనా వార్తలే. ఇక న్యూస్ పేపర్ నిండా కూడా దాని గురించే. ఇంట్లో కుటుంబ సభ్యులు అవే మాటలు.. ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే.. కరోనా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెబుతోంది. ప్రపంచంలోని అన్ని మూలల వరకు కరోనా వెళ్లక పోయినా.. ఆ కరోనా మాట మాత్రం విశ్వమంతా పాకింది. సో మరి ఈ టఫ్ టైమ్ లో .. మనల్ని మనం స్ట్రాంగ్ గా ఎలా ఉంచుకోవాలి. కరోనా బ్రేకింగ్ న్యూస్ తో డే మొదలు పెట్టినా.. ఆ రోజును పాజిటివ్ గా ఎలా ముగించాలి. కోటానుకోట్ల కరోనా వైరస్ మాటల మధ్య.. సానుకూలంగా ఎలా ఉండాలి. అంటే సింపుల్ గా ఈ టిప్స్ ఫాలో కావడమే.

సడెన్ గా ఎక్కడైనా.. ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తే.. ఓ మూడు నాలుగు రోజుల పాటు ఆ విషయం గురించే అంతా మాట్లాడుకుంటారు. అది సహజం. అలాంటిది నెలల తరబడి కరోనా ప్రపంచాన్ని కలవర పెడుతుంటే.. ఇక ప్రజలంతా దేనిగురించి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి మనం ఎలా పాజిటివ్ గా ఉండాలి. మన రోజుని ఎంత అందంగా ముగించాలి అన్నదే ఇక్కడ పాయింట్.

టీవీ ఆఫ్:

ఇక్కడా టీవీ ఆఫ్ చేయడమంటే.. తరుచుగా న్యూస్ చూడొద్దని అర్థం . మ్యూజిక్, కార్టూన్, సినిమాలు, డిస్కవరీ, స్పోర్ట్స్ ఇలా ఏదైనా మనకు నచ్చింది చూడొచ్చు. రోజులో ఒకసారి మేజర్ న్యూస్ చూస్తే సరిపోతుంది. అది కూడా అన్ని న్యూస్ చానెల్స్ తిప్పడం కాదు. ఏదో ఒక న్యూస్ చానెల్ కు స్టిక్ అయిపోండి. రోజూ అదే చూడండి. లేదంటే.. ఉదయాన్నే పేపర్ చూడటం ఉత్తమం.

ప్రకృతి ఆస్వాదన:

లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉండి బోర్ కొడితే.. ఇంటి వరండాలో కాసేపు గడపాలి. డాబాపైకి వెళ్లి కాలక్షేపం చేయొచ్చు. సూర్యస్తమయాన్ని చూడవచ్చు. పక్షుల కిలకిల రాగాలతో ఆనందం పొందవచ్చు. మొక్కలతో మాట్లాడవచ్చు. పెట్స్ ఉంటే వాటితో ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ తో టైమ్ పాస్ చేయొచ్చు. పజిల్స్ తో మెదుడుకు పదును పెట్టాలి. ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు కూడా మనకు చాలా సంతోషాన్నిస్తాయి. ఇవన్నీ కూడా మనలోని నెగెటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ థింకింగ్ వైపునకు డైవర్ట్ చేస్తాయి.

సృజనాత్మకతతో చేస్తే:

చాలా మందిలో సృజనాత్మకత ఉంటుంది. కానీ సమయం లేకపోవడంతో దాన్ని అలానే వదిలేస్తారు. ఇప్పుడు దానికి టైమ్ వచ్చింది. జీన్స్ ప్యాంట్ జేబులతో అందమైన కళాకృతికి రూపం పొయండి. ప్లాస్టిక్ బాటిళ్లతో .. అందమైన గార్డెన్ ను తయారు చేయండి. పాత సీడీలతో ఓ కళాఖండాన్ని రూపొందించండి. కథలు,కవితలు, పెయింటింగ్ ఇలా ఏదైనా సరే.. మనసులో.. ఏ మూలనో ఉన్న బయటకు తీసుకు రండి.

కొత్త కొత్తగా:

ఎప్పటినుంచో కొన్ని పనులను వాయిదా వేస్తూ వస్తాం. వాటికి ఇదే సరైన టైమ్. కొత్త పనులకు శ్రీకారం చుట్టే అద్భుత సమయమిదే. వంట రాకపోతే.. ప్రయోగాలు చేయండి. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మళయాలం , ఫ్రెంచ్, జపనీస్ భాషలు రాకపోతే ఆన్ లైన్ లో చూసి నేర్చుకోండి. సంగీతంపై మక్కువ ఉంటే అటుగా దృష్టి సారించండి. సంగీత వాయిద్యాలు నేర్చుకోవాలంటే.. బోలెడు ఆన్ లైన్ పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. చూసి నేర్చుకోవడమే మన వంతు.

ఆరోగ్యాన్ని మరవద్దు:

యోగ, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తే… ఫిట్‌నెస్ పెరుగుతుంది అలాగే… బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వాకింగ్, జాగింగ్ లు కూడా ఎంతో మంచివి. పచ్చికలో నడుస్తూ చేస్తే.. ఇంకా మంచిది. ఆలోచన ధోరణిలో కూడా మార్పు వస్తుంది.

నవ్వుతూ ఉంటే:

మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నవ్వును మించిన ఆయుధం మరొకటి లేదు. నవ్వుతూ ఉంటే.. శరీరంలోని కండరాలన్నీ యాక్టివ్ గా ఉంటాయి. అందుకే వీలైనంతా నవ్వుతూ . నవిస్తూ ఉండాలి. జోక్స్ చదవండి, కార్టూన్ చానల్స్ చూడండి. ఎంటర్ టైన్ మెంట్ అందించే ఏదైనా సరే చూడాలి.

నిద్రపోయే ముందు:

నిద్ర పోవడానికి రెండు గంటల ముందు మొబైల్ కు దూరంగా ఉండాలి. వీలైతే మెలోడీ పాటలు వినాలి. ఎలాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వద్దు. ఒక వేళ ఆలోచనలు వస్తే.. మన మనసుకు ఆనందాన్ని అందించేవి వస్తే బాగుంటుంది. ఎలాంటి ఆందోళలను పెట్టుకోకుండా.. ప్రశాంతగా నిద్రకు ఉపక్రమించాలి. మంచి నిద్ర కూడా మన ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది.

కుటుంబ సభ్యులతో గడపడం, ఆకలితో ఉన్న వారికి దానం చేయడం, నచ్చిన వారితో మాట్లాడటం, పుస్తక పఠనం, స్పూర్తి నిచ్చే కోట్స్, వీడియోలు చూడటం .. ఇలా చిన్నచిన్న పనులు చేయడం వల్ల కూడా మనలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతోంది. వైరస్ అయినా. . బ్యాక్టరీయా అయినా.. అది ఏ రోగకారిక క్రిమి అయినా.. అది మనల్ని ఎటాక్ చెయ్యాలంటే… మనం బలహీనంగా ఉండాలి. మనం బలంగా ఉన్నప్పుడు అంటే పాజిటివ్ ఎనర్జీతో ఉంటే.. ఏవీ మనల్ని అటాక్ చేయలేవు. మన ధైర్యం, సంకల్పం ముందు రోగాలన్నీ కూడా చాలా చిన్నవి. సో పాజిటివ్ ఉండటం అలవాటు చేసుకుంటే.. అనారోగ్యం మన దరి చేరదు. బీ పాజిటివ్

Tags: CORONAvirus, positive attitude, games, exercise, yoga, meditation


Next Story

Most Viewed