కరోనాకు ఆ పేరెలా?

by sudharani |
కరోనాకు ఆ పేరెలా?
X

మంగళవారం రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నావల్ కరోనా వైరస్‌కి కొత్త పేరు పెట్టింది. కోవిడ్-19 (COVID-19) అని పిలవాలని వెల్లడించింది. ఇందులో CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్. మంగళవారం వరకు ఈ వైరస్‌ను nCov-2019 అని పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి జబ్బులకు పేర్లు పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి విధానాలు పాటిస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది.

పేరు పెట్టడానికి పరిగణనలు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్‌లు సంయుక్తంగా మానవులకు వచ్చే జబ్బులకు పేర్లు పెడతాయి. వీరు పెట్టబోయే పేర్ల కారణంగా వాణిజ్యానికి, పర్యాటకానికి, జంతు సంరక్షణకు, సాంస్కృతిక, జాతీయ, మతపర భావాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాయి.

ముందుగా జబ్బును ఇన్ఫెక్షన్, సిండ్రోమ్, డిజీస్‌గా విభజిస్తారు. ఇప్పటివరకూ మనుషుల్లో గుర్తించనిది, చూపిస్తున్న లక్షణాలకు అందుబాటులో ఎలాంటి పేరు లేకుండా కొత్త జబ్బుగా పరిగణిస్తారు. ఒకవేళ కొత్త జబ్బును గుర్తించిన డాక్టర్లు కానీ, శాస్త్రవేత్తలు కానీ తప్పుడు భావనలు కలిగించే పేరు పెట్టినట్లయితే దాన్ని మార్చే హక్కు డబ్ల్యూహెచ్‌వోకి ఉంటుంది.

తర్వాతి దశల్లో డబ్ల్యూహెచ్‌వో పెట్టిన పేరు కూడా తప్పుడు ప్రభావాన్ని కలిగిస్తోందనిపిస్తే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ వారు ఆ పేరును మార్చొచ్చు. వారికి ఉన్న సూచనల ప్రకారం సైన్సుకి, కమ్యూనికేషన్‌కి, విధానాలకు ఇబ్బంది రాకుండా చూసుకుని పేరు పెట్టాలి. గతంలో స్వైన్‌ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే పేర్ల వల్ల ఆర్థిక వాణిజ్య రంగాలు దెబ్బతిన్నాయని 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ మీడియా ప్రకటనలో తెలిపింది.

పేరు పెట్టే ఉత్తమ విధానాలు

ప్రతి జబ్బు శరీరంలో ఏదో ఒక భాగానికి నష్టం కలిగిస్తుంది. అందుకని శ్వాససంబంధ వ్యాధులు, హెపటైటిస్, న్యూరోలాజిక్ సిండ్రోమ్ వంటి వివరణాత్మక పేర్లు పెడతారు. అలాగే వ్యాధి కాలాన్ని బట్టి ప్రోగ్రెసివ్, జువెనైల్, సివియర్ అనే పదాన్ని తోడుగా తగిలిస్తారు.

ఒకవేళ జబ్బుకు కారణమైన పాథొజన్ ఏదో తెలిసినపుడు దాని పేరు జబ్బు పేరులో ఉంచుతారు. అలాగే అది ఏ సంవత్సరం మొదటగా వెలుగులోకి వచ్చిందో ఆ సంవత్సరం పేరును కూడా జత చేస్తారు. ఉదాహరణకు కరోనా వైరస్ పేరులో 2019 సంవత్సరాన్ని చేర్చడం.

చేయకూడనివి

జబ్బు పేరులో ఆ జబ్బు ప్రారంభమైన భౌగోళిక ప్రదేశం పేరును జొప్పించకూడదు. ఉదాహరణకు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, స్పానిష్ ఫ్లూ, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ అని పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే జబ్బు పేర్లలో మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, సాంస్కృతిక సంబంధ పేర్లు, చావుకి సంబంధించి భయపెట్టే పదాలు ఉండకూడదు.

డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో ప్రాణాలను బలి తీసుకున్న జబ్బులకే సివియర్ అనే పదం చేర్చాలి. పాత రకానికే చెందిన కొత్త పాథోజన్ కనిపెట్టినపుడు నావెల్ అనే పదాన్ని చేర్చాలి. కరోనా వైరస్ కూడా కొత్త పాథోజన్ కాబట్టి మొదట నావెల్ చేర్చారు. కానీ ఇలా పాథోజన్‌లు ఇంకా కొన్ని బయటికి రావడంతో నావెల్ తీసేసి పేరు మార్చారు.

Advertisement

Next Story