నగరవాసులకు HMDA శుభవార్త

by Shyam |   ( Updated:2020-08-21 23:25:36.0  )
నగరవాసులకు HMDA శుభవార్త
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగర శివారులోని రియల్టర్లకు, భవన నిర్మాణాదారులకు హెచ్ఎండీఏ శుభవార్త ప్రకటించింది. శివారు ప్రాంతాల్లో చేపట్టబోయే నిర్మాణాలకు సమీపంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలే అనుమతులు ఇచ్చేలా అధికారాలను బదిలీ చేసింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వాటి పరిధిలో చేపట్టబోయే భవనాల ఎత్తు 5 అంతస్తుల వరకు ఉంటే పర్మిషన్​ ఇవ్వవచ్చు. అలాగే, 1000 చ.మీ.ల ప్లాట్ విస్తీర్ణంలో చేపట్టే భవన నిర్మాణాలకు కూడా స్థానికంగానే అనుమతులు మంజూరు చేసే అవకాశం కల్పించింది. కాగా, లేఔట్లకు అనుమతులు మంజూరుచేసే అధికారాలు మాత్రం హెచ్​ఎండీఏ వద్దనే ఉంటాయి. కాగా, నగర శివారులో కొత్త ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయం పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనుమతులతో పాటు అనుమతి లేకుండా వెలిసే లేఔట్లు, నిర్మాణాల నియంత్రణ, పర్యవేక్షణ తదితరాలు కూడా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే చూసేకోవాల్సి ఉంటుంది.

మున్సిపల్​ కార్పొరేషన్లలోనే 5 అంతస్తులకు అనుమతులు…

హెచ్ఎండీఏ బదిలీచేసిన అధికారాలతో అథారిటీ విస్తరిత ప్రాంతంలోని మునిసిపల్ కార్పొరేషన్ (బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, బోడుప్పల్)లు 18 మీ.ల ఎత్తువరకు(నాన్- మల్టిస్టోర్‌డ్ బిల్డింగ్స్) నివాస భవనాలకు అనుమతులు మంజూరు చేసే అధికారాలను అప్పగించింది. అన్నిరకముల సంస్థలు, వ్యాపార భవనాలు 15 మీటర్ల ఎత్తు వరకు, 1000 చ.మీటర్ల విస్తీర్ణమున్న ప్లాట్లలో కొన్ని షరతులను విధిస్తూ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాలను కార్పొరేషన్లకు అథారిటీ కట్టబెట్టింది. అయితే ఆయా నిర్మాణాలు నిబంధనలకు లోబడి, అన్ని సౌకర్యాలు కలిగి ఉండాల్సి ఉంటుంది.

మునిసిపాలిటీల పరిధిలో…

అథారిటీ పరిధిలోని పురపాలక సంఘం(పెద్ద అంబర్‌పేట్, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, జల్‌పల్లి, మణికొండ, నార్సింగి, శంకర్‌పల్లి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చెల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దూండిగల్, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, తూఫ్రాన్, నర్సాపూర్)లు తమతమ పరిధిలో నివాస భవనాలు 15 మీ.ల ఎత్తు (సెల్లార్ +గ్రౌండ్+4 పై అంతస్తులు లేక సెల్లార్+స్టిల్ట్+5 పై అంతస్తులు) వరకు ఉంటే అనుమతి ఇవ్వవచ్చు. అలాగే, ప్లాట్ విస్తీర్ణం 1000 చ.మీ.ల లోపు ఉన్నా అనుమతులు మంజూరు చేసే అధికారాలను పురపాలక సంఘాలకు అప్పగించినట్టు అథారిటీ వెల్లడించింది. మంజూరు విషయంలో కార్పొరేషన్లకు విధించిన షరతులనే మునిసిపాలిటీలకు వర్తింపజేసింది.

Advertisement

Next Story