వచ్చే జనవరి నుంచే నియామకాలు

by Harish |
వచ్చే జనవరి నుంచే నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా కంపెనీల్లో ఆగిపోయిన నియామకాల ప్రక్రియ సాధారణం స్థాయి నుంచి పెరగడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని రిక్రూట్‌మెంట్ కంపెనీ కెరీర్‌నెట్ కన్సల్టింగ్ కంపెనీ వెల్లడించింది. కరోనా వల్ల నిలిచిపోయిన నియామకాల ప్రక్రియ 2021 జనవరి తర్వాతే వేగవంతమవుతుందని కెరీర్‌నెట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక సేకరించిన వివరాల ప్రకారం అనేక కంపెనీలు ఆరు నెలల తర్వాత నుంచే నియామకాలను చేపట్టనున్నట్టు స్పష్టం చేశాయి. సుమారు 43 శాతం కంపెనీలు 2021, జనవరి తర్వాతే నియామకాలను చేపట్టనున్నట్టు స్పష్టం చేశాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా మారిపోయి కరోనాకు ముందున్న స్థాయికి రావాలంటే 2021 ఏప్రిల్ వరకు ఆగాల్సిందే అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకులు అన్సుమన్ దాస్ అభిప్రాయపడ్డారు.

అలాగే, క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఆలోచనల్లేవని 27 శాతం కంపెనీలు అభిప్రాయపడగా, ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని 39 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి. ఇక, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని 30 శాతం కంపెనీలు తెలిపాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వస్తేనే ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఈ సంవత్సరం క్యాంపస్ హైరింగ్ తగ్గొచ్చని, స్టార్టప్ కంపెనీలపైనే కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉందని అన్సుమన్ దాస్ వివరించారు. అయితే, ఐటీ రంగంలోని కంపెనీలు కొంత వేచి చూసే ధోరణి ఉందని, దిగ్గజ ఐటీ కంపెనీలు ఇదివరకు ఇచ్చిన ఆఫర్లను పరిగణలోకి తీసుకుని, దానికి కట్టుబడి నియామకాలు చెపట్టనున్నట్టు నివేదికలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed