అలా అయితే కపాలం పగిలిపోవాల్సిందే : హీరో బాలకృష్ణ

by Anukaran |
అలా అయితే కపాలం పగిలిపోవాల్సిందే : హీరో బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ కోరారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని నిక్కంపల్లి, బోయ వీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య టీడీపీకి ఓటు వేస్తే భద్రంగా ఉంటామని అన్నారు. ప్రస్తుతం తెలుగు జాతి ఉనికికే ప్రమాదం ఏర్పడిందని..అందువల్ల ప్రజలు టీడీపీని ఆదరించాలని కోరారు. రెండేళ్లుగా రాష్ట్రానికి వైసీపీ చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు.

వాళ్లలోనే కుమ్ములాటలు… టిక్కెట్ రాలేదని పురుగుల మందు తాగడాలు తప్ప ఇంకేమీ ఒరగలేదన్నారు. వైసీపీ కార్యకర్తలే ప్రాణ భయంతో పారిపోతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను ఇలాగే వదిలిపెడితే… నంది ముందు కాలు దువ్వితే రంగు మార్చిన పందిలాగా తయారు అవుతారని అన్నారు. కారు కూతలు కూస్తే కాపాలం పగిలిపోవాలంటూ హెచ్చరించారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 65 కోట్ల నిధితో రోడ్లు… డ్రైనేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

నీతికి అవినీతికి …న్యాయానికి అన్యాయానికి మంచికి చెడుకు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. హిందూపురం ప్రజలు తాగునీటి సమస్య లేకుండా ఉన్నారంటే అందుకు టీడీపీయే కారణమన్నారు. దశాబ్దాలుగా ఉన్న కలను నెరవేర్చింది తమ పార్టీయేనని..గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా హిందూపురానికి తాగునీటిని అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే హిందూపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని హీరో బాలయ్య ప్రజలను కోరారు.

Advertisement

Next Story