వైద్యం అందక గర్భిణి మృతి ఘటనపై హైకోర్టు సీరియస్

by Shyam |

దిశ, మహబూబ్‎నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతిచెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై జిల్లాకు చెందిన న్యాయవాది కిశోర్ హైకోర్టుకు లేఖ రాశారు. ప్రసవం కోసం ఏకంగా 200 కి.మి. ప్రయాణం చేసి చివరకు తల్లీబిడ్డ మృతి చెందినట్లు ఆ లేఖలో కోర్టుకు వివరించారు. ఈ లేఖతో సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రసవం కోసం వచ్చిన మహిళ కంటే అత్యవసరం ఇంకేం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్‌లో ప్రసవం, ఎమర్జెన్సీ కేసులకు తప్పనిసరిగా వైద్యం అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గర్భిణి మృతి ఘటనపై ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన గర్భిణి చికిత్స అందక మృతిచెందిన విషయం తెలిసిందే.

tag: High Court Serious, Government, Pregnant death, Jogulamba Gadwal

Advertisement

Next Story