ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష

by srinivas |
High court convicts two IAS officers
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడటంతోపాటు.. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకపోవడంతో పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు హైకోర్టు శిక్ష విధించింది. అంతేకాదు కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పూనం మాలకొండయ్యకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, పూనం మాలకొండయ్యలకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈనెల 29న శిక్షను ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ సెరికల్చర్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే హైకోర్టు ఆదేశాలను పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలు అమలు చేయలేదు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని నిర్ధారించిన ధర్మాసనం ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది. అయితే ఎంతకాలం శిక్ష విధిస్తారనే విషయాన్ని ఈనెల 29న కోర్టు స్పష్టం చేయనుంది. ఇకపోతే ప్రస్తుతం హర్టీకల్చర్ సెరీకల్చర్ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి ఉన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed