- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించిన హైకోర్టు సీజే
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గురువారం సాయంత్రం సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించారు. అనూహ్యంగా చీఫ్ జస్టిస్ పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. కుటుంబ సమేతంగా వచ్చి సచివాలయం ప్రాంగణాన్ని, లోపల జరుగుతున్న కూల్చివేత పనులను బైట నుంచే పరిశీలించడం గమనార్హం. ఈ పనులను ఎందుకు పరిశీలించాలనుకుంటున్నారనే అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేనప్పటికీ పోలీసులకు మాత్రం ముందుగానే ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారం అందింది.
రవీంద్రభారతి వైపు నుంచి కాన్వాయ్ ద్వారా చీఫ్ జస్టిస్ వస్తారని సమాచారం అందుకున్న పోలీసులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పైకి ఎక్కకుండా సాధారణ ట్రాఫిక్‌ను నియంత్రించడం కోసం పెట్టిన బారికేడ్లను తొలగించారు. ఫ్లై ఓవర్‌పై నుంచి పరిశీలిస్తారనే పోలీసులు భావించారు. కానీ ఊహకు అందని విధంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ ఎక్కకుండా కింది నుంచే వెళ్ళి లుంబినీ పార్కువైపు తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ గేటు మీదుగా ముందుకు వెళ్ళి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే కాన్వాయ్‌ని ఎక్కడా ఆపకుండా కూల్చివేత పనులను కారు లోపలి నుంచే వెళ్ళడం అధికారులకు కూడా అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవడం, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించడానికి రావడం ఆసక్తికరంగా మారింది. కూల్చివేత పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటివరకూ పనులను తాత్కాలికంగా ఆపివేసిన ప్రభుత్వం నిమిషాల వ్యవధిలోనే మొదలుపెట్టింది. సచివాలయం ప్రాంగణంలోని మొత్తం ఎనిమిది బ్లాకులు పూర్తిస్థాయిలో నేలమట్టంకాగా మరో రెండు బ్లాకుల కూల్చివేత పనులు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో అవి కూడా పూర్తిగా కూలిపోనున్నాయి. ఇక శిధిలాలను అక్కడి నుంచి తరలించి నేలను చదునుచేసి కొత్త సచివాలయం కోసం ఏర్పాట్లు చేయడమే తరువాయి.
కొత్త సచివాలయానికి రూ. 400 కోట్లు?
కొత్త సచివాలయం పనులను వీలైనంత తొందరగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో డిజైన్లను ఖరారు చేసిన ప్రభుత్వం సత్వరం నిధులను కూడా విడుదల చేయాలని భావిస్తోంది. సుమారు రూ.250కోట్లు ఖర్చవుతుందని గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత సుమారు రూ.450కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం డిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పదినెలల వ్యవధిలో నిర్మాణం పూర్తికావాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం త్వరలోనే రూ. 400కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిన తర్వాత ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ లోపు కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించడం, వాటిని పరిశీలించి ఖరారు చేయడం లాంటి పనులన్నీ పూర్తికావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రూ. 400 కోట్లు విడుదలైనట్లు వార్తలు వచ్చినా రోడ్లు భవనాల శాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ధృవీకరించలేదు.