హిడ్మా ప్లాన్ సక్సెస్.. ఆపరేషన్‌లో ఆయనదే కీలక పాత్ర?

by Anukaran |
Maoist Hidma
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ ఛత్తీస్ గఢ్ కీలక నేత హిడ్మానే జోనాగుడా ఘటనకు పాత్ర, సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు. దాదాపు పదేళ్లుగా ఛత్తీస్ గఢ్ బలగాలకు మింగుడు పడకుండా దాడులకు పాల్పడుతున్న హిడ్మా నేతృత్వంలోనే బీజాపూర్ ఘటన జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే హిడ్మా సొంత ఊరు గిహ్రి గావ్ ఉంది. హిడ్మా కూడా ఇదే ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నాడన్న సమాచారం మేరకు భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే జోనాగుడా సమీపంలో సుమారు కిలో మీటరు మేర అంబూష్ తీసుకున్న మావోయిస్టులు యూ ఆకారంలో ఉండి దాడికి పూనుకున్నారు.

టీసీఓసీ పనేనా…

భద్రతా దళాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులకు పాల్పడుతుంటుంది. వీరి ప్రధాన లక్ష్యం కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే బలగాలను అంతమొందిండమే. దీనివల్ల తమ ఇలాఖాలోకి బలగాలు అడుగుపెట్టకుండా ఉండాలన్నదే ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. దండాకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికె ఎస్ జడ్ సి) ఇంఛార్జీగా కూడా హిడ్మా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. రూ. 50 లక్షల రివార్డు ఇతనిపై ఉందని, ఇప్పటి వరకు వందల సంఖ్యలో పలు ఘటనలకు పాల్పడ్డట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దండకారణ్యంపై పూర్తి స్థాయిలో పట్టున్న హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో హిడ్మా గురించి సమాచారం అందుకుని కూంబింగ్ నిర్వహించి తిరుగు ప్రయాణం అయ్యాయి. ఈ క్రమంలోనే టీసీఓసీ టీం పోలీసులపై ముప్పేట దాడి చేసింది. ఛత్తీస్ గఢ్ లో సైనిక చర్యలకు పాల్పడేందుకు ఇప్పటి వరకు రామన్న బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇటీవల ఆయన మరణం తరువాత హిడ్మాకు ఈ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed