'హీరో' కుటుంబసభ్యుల మధ్య బ్రాండ్ వివాదం!

by Harish |
హీరో కుటుంబసభ్యుల మధ్య బ్రాండ్ వివాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ యాజమాన్యమైన ముంజల్ కుటుంబంలో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా గతేడాది నుంచి డిమాండ్ పెరిగిన హీరో ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్‌ను వాడుకునే అంశంపై కుటుంబంలో ఘర్షణ మొదలైందని, దీనిపై కుటుంబసభ్యులు చట్టపరమైన పరిష్కారాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి రానున్నట్టు హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజల్ ప్రకటించిన తర్వాత ఈ వివాదం పెరిగిందని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.

పవన్ ముంజల్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి వస్తే హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ పోటీకి సిద్ధమని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇంధన టూ-వీలర్, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న కారణంగానే ఈ రెండు కంపెనీల మధ్య వివాదం పెరిగేందుకు కారణమని అంచనా. అయితే, దీనిపై పెద్దగా ఆందోళనేమీ లేదని నవీన్ ముంజల్ అంటున్నారు. కంపెనీ లావాదేవీల్లో తమ మధ్య స్పష్టమైన ఒప్పందం అమల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. 2010లో హీరో మోటోకార్ప్ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో బ్రాండ్ వినియోగంపై ఖచ్చితమైన నిబంధన ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది మార్చి నాటికి తన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈవీ బైకులు, స్కూటర్ల డిజైన్ కోసం సొంతంగా ఆర్అండ్‌డీని నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే, దీన్ని ఎదుర్కొంటామని, ఒప్పంద అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు నవీన్ ముంజల్ చెబుతున్నారు. మరోవైపు హీరో మోటో కార్ప్ సైతం పోటీకి సిద్ధమని, తమకున్న చట్టపరమైన అవకాశాలను ఉపయోగిస్తామని సంకేతాలిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed