కోడిగుడ్డులో ఆకుపచ్చ సొన.. కారణం ఇదే!

by Shamantha N |
కోడిగుడ్డులో ఆకుపచ్చ సొన.. కారణం ఇదే!
X

కేరళలోని మలప్పురానికి చెందిన ఏకే శిహాబుద్దీన్ తన ఇంట్లో పెంపుడు కోడిపెట్టలు పెట్టిన గుడ్లను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. సాధారణంగా కోడిగుడ్డులో తెల్లసొన, పచ్చ సొన ఉంటాయి. కానీ ఈ ఫొటోల్లో ఉన్న గుడ్లలో పచ్చ సొన పసుపు రంగులో కాకుండా ఆకుపచ్చ రంగులో ఉండటమే అందుకు కారణం. ఈ ఫొటోలు చూసిన కేరళ వెటర్నరీ నిపుణులు పరిశోధనలు ప్రారంభించి, అందుకు కారణం ఏంటనే విషయాన్ని ఒక్కరోజులోనే కనిపెట్టారు.

తమ కోడి తొమ్మిది నెలలుగా ఇలాంటి గుడ్లే పెడుతుందని శిహాబుద్దీన్ పేర్కొనడం శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. అందుకే కొన్ని గుడ్లతో పాటు పెడుతున్న కోడిని కూడా వారు ల్యాబ్‌కు తీసుకెళ్లారు. పరిశోధనలు చేసిన ఇలా జరగడానికి జన్యువులు కారణం కాదని కనిపెట్టినట్లు పౌల్ట్రీ సైన్స్ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శంకరలింగం తెలిపారు. అయితే ఇలా ఆకుపచ్చ పచ్చసొన రావడానికి కారణం ఆ కోళ్లు తింటున్న దాణా అని వారు తేల్చిచెప్పారు. ఆకుపచ్చ సొన గుడ్డు పెట్టిన కోడికి వారు వేరే ఆహారం ఇచ్చినపుడు అది మామూలుగా పసుపు పచ్చ సొన ఉన్న గుడ్డునే పెట్టిందని శంకరలింగం వెల్లడించారు. అదే ఆహారాన్ని ఫార్మ్‌లో ఉన్న కోళ్లకు కూడా పెట్టాలని శిహాబుద్దీన్‌కి అధ్యాపకులు సూచించారు. అలా చేసిన తర్వాత ఆకుపచ్చ సొన గుడ్లు పెట్టిన కోళ్లన్నీ ఇప్పుడు మామూలు గుడ్లనే పెడుతున్నట్లు వారు తెలిపారు. అయితే ఇలా ఆకుపచ్చ రంగుకి మారడానికి కారణమైన ఆహార పదార్థం ఏది అనేది ఇంకా తెలియరాలేదు. అది బహుశా కొవ్వులో కరిగే పదార్థం అయ్యుండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story