ముంబయిని ముంచిన వర్షం

by Shamantha N |
heavy rains in mumbai
X

ముంబయి: దేశ వాణిజ్య నగరాన్ని వర్షం ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుండపోతగా కురిసింది. ఆదివారం 12 గంటల్లో(రాత్రి 8.30 వరకు) 16.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం రాత్రి మూడు గంటల కాలంలోనే ముంబయిలోని కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే తెలిపారు. భారీ వర్షం గంటల వ్యవధిలోనే మహానగరాన్ని అతలాకుతలం చేసింది. కొండప్రాంతాల్లో చరియలు విరిగిపడటంతో ఇళ్లు దెబ్బతినడం, కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే ఐదు ఘటనల్లో 32 మంది మరణించారు. రెండు చోట్ల చరియలు విరిగిపడటం, ఒక చోటా వర్షందాటికి ఇల్లు కూలిపోవడంతో 30 మంది మరణించగా, కరెంట్ షాక్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఎనిమిది అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. బాండూప్‌లో పంపింగ్ సిస్టమ్‌ పాడవడంతో ముంబయి మహానగరంలో తాగునీరు అందలేదు. వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సమకూర్చుకోవాల్సి వచ్చింది. కొలాబా, సెంట్రల్ ముంబయి, మహాలక్ష్మీ, బాంద్రా, కుర్లా, మలాడ్, కాందీవలి, ఘట్‌కోపర్ సహాపలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలూ కొన్ని గంటలపాటు స్తంభించాయి. రోడ్లు, ట్రాక్‌లు నీటమునగడంతో ప్రయాణాలు సాగలేవు. ఆందేరి, కుర్లా, చెంబూర్, గాంధీ మార్కెట్ సహఆ 34 లొకేషన్లలో భారీగా వరదనీరు చేరడంతో కనీసం 118 రూట్లలో బస్సులు నడవలేవు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మూలంగా ముంబయి ఎయిర్‌పోర్టు కొన్నిగంటలపాటు(రాత్రి 12.42 గంటల నుంచి 5.24 గంటల వరకు) మూసేశారు. ఫలితంగా తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారిమళ్లించారు.

శనివారం రాత్రి లేదా ఆదివారం తెల్లవారుజామున ముంబయిలో కుండపోత వర్షం పడింది. రాత్రి ఒకటి, రెండు గంటల ప్రాంతాల్లోనే ఇళ్లు కూలిపోయాయి. చెంబూర్‌లోని భరత్‌నగర్‌ ఏరియాలో మిట్టప్రాంతంలోని ఓ కాంపౌండ్ వాల్ కూలి సమీపంలోని ఇళ్లపై పడటంతో 19 మంది మరణించారు. బురద కూడా కొట్టుకురావడంతో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, బీఎంసీ సిబ్బంది కలిసికట్టుగా గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగా విక్రోలి సూర్యనగర్‌లోని ఐదు గుడిసెలు కూలిపోయాయి. ఇందులో పది మంది నివాసులు ప్రాణాలు విడిచారు. బాండూప్ వెస్ట్‌లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించారు. ఆందేరిలో ఓ షాపులో ఆదివారం ఉదయం కరెంట్ షాక్‌కు గురై 26ఏళ్ల వ్యక్తి చనిపోయారు. కాందివలీ ఈస్ట్‌లో ఓ వ్యక్తి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలన్న ఆతృతతో ఇంటి నుంచి తన లగేజీని తరలిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఆ ఏరియాలో ఎనిమిది అడుగుల మేర నీరు నిలవడంతో నీట మునిగిన ఓ ఎలక్ట్రిక్ బాక్స్‌కు ఆయన తగిలడంతో షాక్ కొట్టింది. తర్వాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు.

వర్షం ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే, నవాబ్ మాలిక్ సహా పలువురు నేతలు పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉన్నతాధికారులతో ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. మున్సిపల్ సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేయాల్సిందిగా ఆదేశించారు. ముంబయి సహా రాష్ట్ర తీరప్రాంతాల్లో ఐదురోజులపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం ఠాక్రే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisement

Next Story