సమస్యలకు నిలయంగా సిరిసిల్ల కలెక్టరేట్

by Anukaran |   ( Updated:2021-07-23 00:45:00.0  )
సమస్యలకు నిలయంగా సిరిసిల్ల కలెక్టరేట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, సిరిసిల్ల: సప్త వర్ణ శోభితంగా తలపిస్తున్న ఆ భవనం డిజైన్ చేయడంలో తప్పు చేశారా.. ? భవనం నిర్మించిన స్థలాన్ని ఎంపిక చేయడంలో తప్పు చేశారో తెలియదు కానీ లోపాలు మాత్రం స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగమే ఇలా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయడంలో అధికారులు విఫలం అయ్యారా అన్న ప్రశ్న స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.

స్థలం ఎంపికలోనే…

వేములవాడ, హైదరాబాద్ బైపాస్ రోడ్డులో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనం స్థలం ఎంపికలోనే లోపాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన డ్రైన్ వాటర్, రగుడు వాగు వరద నీరు ఈ ప్రాంతానికే వచ్చి చేరుతుంటోంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించడంలో అధికారులు విఫలం అయ్యారని స్పష్టం అవుతోంది. నిత్యం నీటి నిలువతో ఉండే ఈ ప్రాంతంలో భవనం నిర్మిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు ముంచుకొస్తాయా లేదా అన్న విషయాన్ని విస్మరించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం నాడు కురిసిన వర్షంతో వరద నీరు కలెక్టరేట్‌ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బి ఈఈ కిషన్ రావు విడుదల చేసిన ప్రకటనలోనూ వారి తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రగుడు వాగు నీళ్లు ఉధృతంగా ప్రవహించడం వల్ల, కుండపోతగా వర్షాలు కురియడం వల్లే కలెక్టరేట్ గేట్ వద్ద నీరు నిలిచిందని ఈఈ కిషన్ రావు ఆ ప్రకటనలో వివరించారు.

భారీ వర్షాలు వచ్చినప్పుడు, రగుడు పొంగిపొర్లినప్పుడు కలెక్టరేట్‎ను వరద నీరు ముంచేస్తే ఎలా అన్న విషయాన్ని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారో అంతు చిక్కకుండ తయారైంది. జిల్లాలోని ప్రజలందరికీ సేవలందించాల్సిన కలెక్టరేట్‎లో ప్రభుత్వ శాఖలన్ని కూడా ఇక్కడి నుండే సేవలందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందో అధికారులకే తెలియాలి. ఒక వేళ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం లేనట్టయితే వరద నీరు వచ్చినా వాటిని దారి మళ్లించేందుకు ముందుగా ప్లాన్ చేసిన తరువాత భవనాన్ని నిర్మించాలి కానీ ఇప్పుడు కాలువలు నిర్మిస్తామని చెప్తుండడం విడ్డూరంగా ఉంది.

అప్పుడే ఎన్నో అనుభవాలు..

కలెక్టరేట్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఎన్నో అనుభవాలను అధికారులు ఎదుర్కొన్నారు. గతంలోనే వర్షాలు కురిసినప్పుడు కలెక్టరేట్ ప్రాంతమంతా జలమయం అయింది. ముఖ్యమంత్రి ఈ భవనాన్ని ప్రారంభించే రెండు రోజుల ముందు కురిసిన వర్షాలతో కూడా ఆవరణ అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్ ప్రాంతానికి చేరుతున్న నీటిని దారి మళ్లించేందుకు చొరవ చూపిస్తే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేది కాదు కదా అంటున్నారు స్థానికులు. గేటు వద్ద మాత్రమే వరద నీరు వచ్చి చేరుతోందని చెప్తున్న అధికారులు గేటు లోపల ప్రాంతంలో కూడా వరద నీరు నిలిచిన విషయాన్ని కప్పిపుచ్చడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే మిస్టరీగా మారింది. ఇప్పుడు కలెక్టరేట్ అవతలి ప్రాంతంలో కాలువలు నిర్మిస్తే వరద నీటి సమస్య పరిష్కారం అవుతుందని వివరిస్తున్న అధికారులు అప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నది వాస్తవం. సాంకేతిక నిపుణులు ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి, రానున్న కాలంలో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసి డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

భవనంలోనూ..

ఎక్స్ పాన్సన్ జాయింట్ పని పెండింగ్‌‌లో ఉండడం వల్ల లీకేజీలు అవుతన్నాయని అధికారులు ప్రకటించారు. అయితే భవన నిర్మాణ సమయంలోనే ప్లంబర్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంటుంది. బిల్డింగే కంప్లీట్ అయిపోయిందని ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవాలు చేయించిన 18 రోజుల తరువాత కూడా పనులు పూర్తి కాలేదని అధికారులే ఒప్పుకుంటున్నారు. ఈ పనులన్నీ పూర్తయిన తరువాత కార్యాలయాలను తరలిస్తే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవనం నిర్మాణ సమయంలో అర్కిటెక్చర్స్‌కు జిల్లా యంత్రాంగానికి సమన్వయం లేకుండానే డిజైన్ చేశారని స్పష్టం అవుతోంది. సుమారు 50కి పైగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండాల్సిన ఈ భవనంలో శాఖల వారిగా సిబ్బందిని సంఖ్యను బట్టి అడ్మినిస్ట్రేటివ్ హాళ్లు, అధికారుల ఛాంబర్స్ నిర్మించే విధంగా ప్లాన్ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రధాన శాఖలకు చెందిన వాటిని విస్మరిస్తే చాలా శాఖలకు కేటాయించిన కార్యాలయాల విషయంలో ప్రణాళికలు లేకుండానే నిర్మించారని అర్థం అవుతోంది. పెద్ద హాళ్లు నిర్మించి వదిలేయడంతో ఒక్కో హాళ్లో రెండు విభాగాలకు చెందిన కార్యకలాపాలు సాగుతున్నాయి. అలాగే కొన్ని శాఖల అధికారుల ఛాంబర్స్ ఓ చోట ఉంటే వారి డిపార్ట్ మెంట్‌కు చెందిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు మరో చోట ఉన్నాయి. కొన్ని శాఖల అధికారులకు ప్రత్యేకంగా ఛాంబర్స్ నిర్మించకపోవడంతో ఆయా శాఖలే వీటిని నిర్మించుకుంటున్నాయి. నేటి పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయాల్సిన విషయంలో అలాంటి చర్యలే కనిపించడం లేదని కలెక్టర్ ఉద్యోగులు గొణుక్కుంటున్నారు.

లిఫ్ట్ ఒకటే..

ప్రధాన కార్యాలయాల బాసులు వెళ్లే ప్రాంతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఒకటి మాత్రమే పని చేస్తుండగా మరో లిఫ్ట్ ద్వారా సేవలందించడం లేదు. దీంతో సెల్లార్ లో పని చేస్తున్న యంత్రాంగం తమ ఆఫీసులకు చేరడానికి అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారైనా, దివ్యాంగులైన యంత్రాంగమే అయినా తమ వాహనాలను సెల్లార్ లో పార్క్ చేసి మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒక్కో ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి. దీనివల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శానిటేషన్, తాగునీరు తదితర విషయాల్లోనూ నేటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆయా శాఖల ఉద్యోగులే వాటిని సమకూర్చుకుంటున్న పరిస్థితి తయారైంది. వందలాది మంది ఉద్యోగులు పని చేసే కలెక్టరేట్ కార్యాలయంలో సేవలు అందుకునేందుకు వేలాది మంది ప్రజలు నిత్యం వస్తూ వెళ్తుంటారు. అటు ప్రజలకు ఇటు అధికార యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed