Scarlet Fever: వణికిస్తున్న స్కార్లెట్‌ జ్వరం.. లక్షణాలు ఇవే..!

by Indraja |
Scarlet Fever: వణికిస్తున్న స్కార్లెట్‌ జ్వరం.. లక్షణాలు ఇవే..!
X

దిశ డైనైమిక్ బ్యూరో: భాగ్యనగరాన్ని స్కార్లెట్‌ జ్వరం భయపెడుతోంది. నగరంలో స్కార్లెట్‌ జ్వరం శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనితో నగరంలోని చిన్నపిల్లల ఆసుపత్రులు, బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డుకు జ్వరంతో వచ్చే 20 మంది బాధితుల్లో దాదాపు 10-12 మందిలో ఈ స్కార్లెట్ జ్వరం లక్షణాలు బయటపడుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇక కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి భారీన పడిన చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోనే జాయిన్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక గతంలో ఈ వ్యాధి ప్రబలిన త్వరగా తగ్గిపోయింది. అయితే మళ్ళీ గత కొంతకాలం నుండి ఈ వ్యాధి పిల్లలపై విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులకు వచ్చే చిన్నారుల్లో ఈ జ్వరం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 5 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు పిల్లల్లో జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాకాకుండా వైరల్ లక్షణమని భావించి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తోంది. ఈ వ్యాధి భారిన పడిన పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే ఆతుంతపర్లు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పొరపాటున ఈ వ్యాధి సంక్రమించిన పిల్లలు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పడే తుంపర్ల దగ్గర మీ చేతులు ఉంచి.. ఆ తరువాత మీ చేతులు శుభ్రం చేసుకోకుండా వేరే పిల్లలను తాకితే ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి కూడా సంక్రమిస్తోంది.

అందుకే తల్లిదండ్రులు పరిశుభ్రంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే స్కార్లెట్ ఫీవర్ గురించి తల్లిదండ్రులను హెచ్చరిస్తూ నగరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే వాట్సాప్ సందేశాలు పంపాయి. పిల్లల్లో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. వ్యాధి తగ్గే వరకు పిల్లలను పాఠశాలలకు పంపకూడదని సూచించారు.

వ్యాధి లక్షణాలు

102 డిగ్రీల జ్వరం

కడుపు నొప్పి, శరీరంపై దద్దుర్లు

తలనొప్పి, వికారం, వాంతులు

హఠాత్తుగా గొంతు నొప్పిగా అనిపించడం

గొంతు, నాలుకపై తెల్లటి పూత

నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం

ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దగా కనిపించడం

Advertisement

Next Story

Most Viewed