పెరిగిన బీమా పాలసీ అమ్మకాలు

by Harish |
health insurance
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్య బీమా పట్ల అవగాహన పెరిగింది. ముఖ్యంగా రూ. కోటి కవరేజీని అందించే అధిక మొత్తం పాలసీల అమ్మకాలు భారీగా పెరిగాయని పాలసీబజార్ తెలిపింది. 2019 చివర్లో రూ. కోటి కవరేజీని అందించే అధిక మొత్తం పాలసీల వృద్ధి 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 35 శాతానికి పెరిగినట్టు పాలసీబజార్ వెల్లడించింది. అధిక మొత్తం కవర్ చేసే పాలసీల పట్ల అవగాహన పెరగడమే దీనికి ప్రధాన కారణమని పాలసీబజార్ ఆరోగ్య బీమా విభాగం హెడ్ అమిత్ ఛబ్రా చెప్పారు. 2021లో మొదటి 3 నెలలకు పాలసీబజార్‌లో సగటు రూ. కోటి ఆరోగ్య బీమా కోసం బుక్ చేసుకున్న వారు 12.5 శాతంగా ఉన్నారు. గతేడాది ఇదే సమయంలో ఇది 9 శాతంగా ఉంది. 2020, మే నెలలో కరోనా ఆందోళన, ఆసుపత్రి ఖర్చుల నేపథ్యంలో 15 శాతంగా ఉన్న అధిక మొత్తం బీమా పాలసీలు జూన్ నెలలో 35 శాతానికి పెరిగాయి.

అలాగే, పాలసీబజార్‌లో విక్రయించిన మొత్తం ఆరోగ్య బీమా పాలసీల్లో 35 శాతం వాటా రూ. 5 లక్షల విలువైన పాలసీలు ఉండగా, 11 శాతం రూ. 10 లక్షల కవర్‌ను కలిగి ఉన్నాయి. రూ. కోటి విలువైన కవర్ అందించే పాలసీల వాటా 15 శాతంగా ఉంది. ‘అధిక మొత్తం బీమా చేసిన పాలసీల విషయంలో ఎక్కువ సానుకూల స్పందనను చూస్తున్నాము. ఆరోగ్యం విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉంటున్నారు. తాము కూడా అధిక మొత్తం కవరేజీలను అందించే వాటిని మాత్రమే కొనకుండా, పలు రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించే విధంగా ఉండే అడిషనల్ పాలసీ ఉత్పత్తులను తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నాము. దీనివల్ల పాలసీదారులు అన్ని రకాల పాలసీ కవర్‌లను కలిగి ఉంటారని’ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈఓ మయాంక్ బత్వాల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed