బూస్టర్ డోస్ ఇవ్వలేం… తేల్చిచెప్పిన వైద్యారోగ్యశాఖ

by Shyam |   ( Updated:2021-10-09 10:47:02.0  )
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బూస్టర్ డోస్‌ను ఇప్పుడే ఇవ్వలేమని వైద్యారోగ్యశాఖ తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ల కొరత కారణంగా కేవలం ఫస్డ్,సెకండ్ డోసులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే మన రాష్ట్రంలో 70 శాతం మంది తొలి డోసు పొందగా.. రెండు డోసులు వేసుకున్న వారు కేవలం 38 శాతం మాత్రమే ఉన్నారు. దీంతో వీలైనంత వరకు వేగంగా టీకాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. మరోవైపు హైకోర్టు కూడా టీకా పంపిణీలో వేగం పెంచాలని సూచించింది. దీంతో మొదటి, రెండో డోసు పూర్తి కాకుండా, ఇప్పడికిప్పుడు బూస్టర్ డోసును ఇవ్వడం సాధ్యం కాదని సెక్రటేరియట్ లోని ఓ కీలక అధికారి దిశకు తెలిపారు. బూస్టర్ డోసు పంపిణీపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చేలోపు అర్హులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

రక్షణ ఆరు నెలలే..

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో గరిష్ఠంగా 6 నెలలు వరకు రక్షణ లభిస్తుందని వివిధ పరిశోధనలతో పాటు టీకా ఉత్పత్తి కంపెనీలు కూడా పేర్కొన్నాయి. అయితే దీర్ఘకాలిక రోగులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కేవలం 4 నెలల వరకు ప్రభావం ఉంటుందని ఇటీవలే ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. అయితే జనవరి నుంచి థర్డ్ వేవ్ షురూ అవుతుందని ఇటీవల ఎయిమ్స్ చేసిన ప్రకటనతో, గడువు ముగిసిన వారికి మళ్లీ వైరస్ భయం పట్టుకుంది. బూస్టర్ డోసు ఎప్పుడు వేస్తారు? అంటూ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఆరా తీస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ క్షేత్రస్థాయి సిబ్బందిని అడుగుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తామని పీహెచ్సీ సిబ్బంది వివరిస్తున్నారు.

సింగిల్ డోసుతో 96 శాతం రక్షణ ఉంటుంది.. డా కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ హెచ్ఓడీ నిజామాబాద్

వ్యాక్సిన్ సింగల్ డోసు తీసుకున్న వారిలో 96 శాతం, రెండు డోసులు పూర్తి చేసుకున్నోళ్లకు 98 శాతం వరకు కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే వ్యాక్సిన్ గరిష్ఠంగా ఆరు నెలల కాలం ప్రభావం చూపుతుందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ గడువు ముగిసినోళ్లు బూస్టర్ డోసు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అయితే బూస్టర్ డోసులో మిక్స్డ్ పద్ధతిపై కూడా వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సర్వేల ప్రకారం మిక్స్డ్ బూస్డర్ డోసుతో 3 రెట్లు అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది. కానీ దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరుగుతున్నది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల్లో కేవలం 4 నెలల వరకే ప్రభావం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో బూస్టర్ డోసును ప్రారంభిస్తే తొలుత వారికి ఇవ్వడం బెటర్.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ స్టేటస్…

కేటగిరీ డోసు1 డోసు2
హెల్త్కేర్ 3,06,659 2,39,217
ఫ్రంట్లైన్ 3,17,992 2,35,994
18–44 1,11,53,352 31,71,534
45పైబడి 79,54,864 38,96,399
మొత్తం 1,97,32867 75,43,144

Advertisement

Next Story

Most Viewed