వేరుశనగతో ఎన్ని లాభాలో..

by sudharani |   ( Updated:2021-06-30 01:08:36.0  )
Health Benefits Of Groundnuts
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామందికి ఉదయం పూట పప్పులను నానబెట్టి తినడం అలవాటు ఉంటుంది. అందులో శనగలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది పల్లీలను తింటూ ఉంటారు. అయితే వేరుశనగలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. కానీ వీటిని ఎలా తింటే మంచిది, ఎన్ని రకాలుగా వీటిని మనం తినవచ్చు, వీటిని తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

నానబెట్టిన వేరుశనగలు….

రాత్రిపూట నానబెట్టిన వేరుశనగలను ఉదయాన్నే పొట్టు తియకుండా తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నానబెట్టిన వేరుశనగల్లో ఉండే ప్రోటీన్లు అధిక శాతం మన శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. దానితోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురికాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ వేరుశనగలు తినడం వల్ల, క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విటమిన్-సి, గ్రీన్ టీల ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా నానబెట్టిన వేరుశనగ విత్తనాల తొక్కలోనే అధికంగా ఉన్నాయి. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా చేస్తాయి.

ఉడికించిన వేరుశనగ…

నానబెట్టిన వేరుశనగ తినడం కంటే చాలా మంది ఉడికించిన వేరుశనగ తినడానికి చాలా ఇష్టపడుతారు. అయితే ఈ ఉడికించిన వేరుశనగ తినడం వలన కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఉడికించిన వేరుశనగ తినడం వలన బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.. ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వలన విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా శరీరంలో అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. ఎర్రరక్తకణాల పెరుగుదలకు ఈ విటమిన్ బి ఉపయోగ పడుతోంది. అలాగే ఎముకలు, నరాలు ఉత్తేజం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. మధ్యాహ్న భోజనం, రాత్రిభోజనం మధ్య సమయంలో సాయంకాలంపూట స్నాక్స్ సమయంలో ఉడికించిన వేరుశనగలు తీసుకోవడం వలన సాయంత్రం పూట వచ్చే నీరసం తగ్గుతుంది.

వేపిన వేరుశనగలు….

వేపిన వేరుశనగలకు మన శరీరంలోని విష వ్యర్థాలని అడ్డుకునే శక్తి ఉంటుంది. తొక్క తీసి తింటే మరింత మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే ఈ వేయించిన వేరుశనగలో క్యాలరీలు అధికంగా ఉంటాయి దీంతో బరువు పెరగడానికి ఇది ఉపయోగపడుతోంది.

బెల్లంతో కలిపిన వేరుశనగలు…

బెల్లం వేరుశనగలు కలిపి తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వేరుశనగలో ఉండే ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అలాగే మహిళల్లో రుతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

Advertisement

Next Story

Most Viewed