పోలీసులే లక్ష్యంగా బాంబ్ బ్లాస్ట్.. సామాన్యులు బలి

by Shyam |
bomb blast, Maoists
X

దిశ‌, వెంక‌టాపురం: పోలీసులే ల‌క్ష్యంగా అమ‌రుస్తున్న బాంబుల‌కు సామాన్య ప్రజ‌లు బలి అవుతున్నారని, అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఈ మేరకు సోమ‌వారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భ‌ద్రాద్రి కొత్తగుడెం జిల్లా చ‌ర్ల మండ‌లంలో సోమవారం పోలీసులే లక్ష్యంగా మావోయిస్టలు అమ‌ర్చిన ప్రేష‌ర్ బాంబు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయ‌న్నారు. గ‌తంలో మావోయిస్టులు అమ‌ర్చిన ప్రేష‌ర్ బాంబు పేలి వెంక‌టాపురం మండ‌లానికి చెందిన ప‌లువురు గాయాల పాలైన‌ట్లు గుర్తుచేశారు. వెంక‌టాపురం, వాజేడు మండ‌లంలో అసాంఘీక కార్యక్రమాలు చేస్తూ పోలీసుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను చంప‌డానికి అనేకసార్లు మైన్స్ అమ‌ర్చారని గుర్తుచేశారు.

లాంటి కొన్ని మైన్స్ గుర్తించి కొన్నింటిని పోలీసులు నిర్వీర్యం చేశార‌న్నారు. కొన్ని పేలి సామాన్య ప్రజ‌లు, ప‌శువులు మృత్యువాత ప‌డ్డాయ‌న్నారు. జూన్ 2016లో కొత్తప‌ల్లి ఎక్స్ రోడ్డు వ‌ద్ద మావోయిస్టులు అమ‌ర్చిన ప్రేష‌ర్ బాంబు పేలి తెల్లం ర‌మేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయ‌న్నారు. న‌వంబ‌ర్ 2016లో విజ‌య‌పురి కాల‌నీ శివార్లలో మావోయిస్టులు అమ‌ర్చిన బాంబు పేలి గుగ్గిళ్ల కార్తీక్‌కు గాయాలు అయ్యాయ‌ని గుర్తుచేశారు. 2019లో ముకునూరు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు అమ‌ర్చన ల్యాండ్‌మైన్‌పై కాలువేసి పెంట‌య్య అనే గిరిజ‌నుడు మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. మార్చి 2021లో పాలెం ప్రాజెక్టు క‌ట్టపై అమ‌ర్చిన ల్యాండ్ మైన్ పేలిన‌ట్లు వెల్లడించారు. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్‌లు అమ‌రుస్తున్నారని అన్నారు. అట‌వీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed