ఈ గ్రామ రైతే నాకు బస్తా బియ్యమిచ్చాడు: హరీశ్ రావు

by Shyam |
ఈ గ్రామ రైతే నాకు బస్తా బియ్యమిచ్చాడు: హరీశ్ రావు
X

దిశ, మెదక్: రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారి.. వ్యవసాయం దండగ కాదు.. పండుగ కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం దాతర్ పల్లి గ్రామంలో రైతు శ్రేయస్సు ప్రభుత్వ సంకల్పం, వానాకాలం -2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రాధాన్యత పంటల సాగుకు మేము సైతమని మంత్రి హరీష్ రావు సమక్షంలో ప్రతినబూని గ్రామ పంచాయతీ తరపున తీర్మాణ పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత్రిత పంట సాగు కాదు.. ఇవాళ్టి నుంచి ప్రాధాన్య పంట సాగు అందామని అన్నారు. రైతే రాజు కావాలన్నది.. నినాదం.. కానీ విధానంగా మారాలన్నారు. దాతర్ పల్లి అంటే ఆదర్శమని, పోయిన ఏడాది సన్నరకం వరి పండించి సేంద్రీయ ఎవుసం చేశామని, ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు ఓ బస్తా బియ్యం ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారన్నారు.

పేలిపోయే ట్రాన్స్ ఫార్మార్లు, కాలిపోయే మోటార్లతో ఒకప్పుడు రైతులు బతుకు వెళ్లదీసేవారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట ఎండలేదు, ఒక గంట కరెంటు పోలేదన్నారు. నాడు ఎరువులు కావాలంటే.. క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ, ఇవాళ మీ ఊర్లకే యూరియా బస్తాలు పంపుతున్నామన్నారు. ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం షావుకారు దగ్గర రైతు అప్పు తెచ్చెదని, కానీ, సీఎం కేసీఆర్ సర్కారులో రైతుబంధు కింద పెట్టుబడి సాయం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు కింద రూ. 7 వేల కోట్లు బ్యాంకులో వేయమని, రెండు విడతల రైతుబంధు కింద రూ.14 వేల కోట్లు బరాబర్ ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ మాకు చెప్పారని మంత్రి వెల్లడించారు. రూ. 25 వేలలోపు ఉన్న వారందరికీ వారం రోజుల్లో, రూ. లక్షలోపు ఉన్న వారందరికీ నెల రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ప్రాధాన్యత పంట సాగులో రాష్ట్రానికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శమైందని, నియోజకవర్గంలోని 8 మండలాల్లో 5 మండలాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయంటూ అభినందించారు. విక్రయ కేంద్రానికి రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని మంత్రి సూచించారు. వానా కాలంలో మొక్కజొన్న సాగును పూర్తిగా వదిలి కంది పంట, పత్తి పంట పైపు రైతులు ఆసక్తి చూపాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Advertisement

Next Story