నందమూరి నటసింహం బాలయ్యకు బర్త్ డే విష్

by Jakkula Samataha |   ( Updated:2020-06-10 01:30:56.0  )
నందమూరి నటసింహం బాలయ్యకు బర్త్ డే విష్
X

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ‘తాతమ్మ కల’ సినిమాతో 14 ఏళ్ల ప్రాయంలోనే సినీరంగంలో అడుగుపెట్టి ‘భారతంలో బాలచంద్రుడి’గా ప్రశంసలు అందుకున్నాడు. ‘సాహసమే జీవితం’గా 46 ఏళ్ల సినీ ప్రయాణంలో సినీ ప్రేక్షకుల ‘ముద్దుల మామయ్య’గా.. మా ఇంటి బాలయ్యగా తెలుగు ప్రజల సొంత మనిషి అయిపోయాడు. వ్యక్తిత్వంలో ‘నిప్పులాంటి మనిషి’ అని సినీ ఇండస్ట్రీ మెప్పు పొందుతూ బాక్సాఫీస్ వద్ద ‘పైసా వసూల్’ చేసి ‘టాప్ హీరో’ అయిపోయాడు. ‘ఆదిత్య 369’ సినిమా ద్వారా ప్రేక్షకలోకాన్ని మరో లోకంలోకి తీసుకెళ్లి అటు క్లాస్ ఇటు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన బాలయ్య.. జానపదం, సాంఘీకం, పౌరాణికం పాత్ర ఏదైనా సరే, అవలీలగా చేయగలనని రుజువు చేస్తూ తెరపై ‘సింహా’ అనిపించుకున్నాడు. కాగా జూన్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్య ఇండస్ట్రీ నుంచి బెస్ట్ విషెస్ అందుకున్నాడు.

‘60వ పడిలో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్టి పూర్తి శుభాకాంక్షలు’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు మెగాస్టార్ చిరంజీవి. ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపాడు. ‘నాలోని అభిమానిని తట్టిలేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే’ అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు తారక్. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు.

‘60వ వసంతంలోకి అడుగుపెడుతున్న మా బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశాడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. ‘మా సొంత నిర్మాణ సంస్థ RK Films అన్నగారి(ఎన్టీఆర్) వారసుడితోనే ప్రారంభించాలనుకున్నాం. అనుకున్నట్టుగా మా బాలయ్యతోనే అది మొదలైంది.. నా కల నిజమైంది’ అన్నారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మరెన్నో శిఖరాలు అధిరోహించాలని బాలయ్యను ఆశీర్వదించాడు కేఆర్.

బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని విష్ చేశాడు హీరో కళ్యాణ్ రామ్. ‘మీరు ఎందరికో బాలయ్య.. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్’ అన్నారు. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను, మీ స్ఫూర్తితోనే కొనసాగుతున్నానన్న కళ్యాణ్ రామ్.. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

‘ఏ పాత్రనైనా అవలీలగా పోషించే కథానాయకుడు బాలకృష్ణ’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. నందమూరి వంశోద్ధారకుడు, సాంఘిక, పౌరాణిక, జానపద చారిత్రాత్మక పాత్రధారణలో మా బాలయ్య నటసింహం అని కీర్తించాడు. ‘ఏ ఇంటి వారైనా కోరుకునే వంశానికొక్కడు బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు’ తెలిపాడు. నట, రాజకీయ జీవన వైభవ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, పూర్ణాయుష్మాన్ భవ అని దీవించాడు పరుచూరి.

‘హ్యాపీ బర్త్ డే బాల మామ’ అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు నారా రోహిత్. ప్రతీ ఒక్కరిని గౌరవించే వినయం, వినమ్రతకు గొప్ప ఉదాహరణ బాలయ్య అని తెలిపాడు. పాము లేదా గొర్రెల అభిప్రాయాన్ని పట్టించుకోని ‘ది లయన్‌’కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

Advertisement

Next Story