అలా చేతులు కడుక్కోమంటూ అలారం

by Harish |
అలా చేతులు కడుక్కోమంటూ అలారం
X

కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే బయటికి వెళ్లివచ్చినపుడు, లేదా ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతులు కడుక్కోవాలని ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. మనకు కూడా అన్నింటికన్నా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రకటనల్లో చెప్పినట్లు చేయాలని అనిపిస్తుంటుంది. కానీ పని గొడవలో పడి చేతులు కడుక్కోవడం మర్చిపోవచ్చు. అందుకే అలా మర్చిపోకుండా ఉండటానికి శాంసంగ్ వాచీలు ఉపయోగిస్తున్నవారికి ఆ కంపెనీ హ్యాండ్ వాష్ యాప్‌ని ప్రవేశపెట్టింది. గెలాక్సీ వాచీల్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అలారం మోగుతూ చేతులు కడుక్కోవాలని గుర్తు చేస్తుంది. కావాలంటే ఈ సమయాన్ని మార్చుకోవచ్చు.

అలారం వచ్చినపుడు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వాచీ మీద స్వైప్ చేస్తే 25 సెకన్ల టైమర్ ప్రారంభమవుతుంది. ఇందులో మొదటి 5 సెకన్లు సబ్బు రుద్దుకోవడానికి, మిగతా 20 సెకన్లు చేతులు ఒకదానితో ఒకటి రుద్దడానికి అని వాచీ గుర్తుచేస్తుంది. ఎలాగూ ఈ గెలాక్సీ వాచీలు వాటర్‌ప్రూఫ్ కాబట్టి చేతులు కడుక్కునేటపుడు వీటిని తీసేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ వాచీలో చేతులు కడుక్కోవడానికి సంబంధించి వివిధ ట్రాకింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎంతసేపు చేతులు శుభ్రం చేసుకున్నారు? ఒక వారంలో ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నారు? ఇలా అన్ని రిపోర్టులను తర్వాత యాప్‌లో సమీక్షించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed