ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెలా సగం జీతమే

by Shyam |
ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెలా సగం జీతమే
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పేదలకు రూ.1500 చొప్పున నగదు ఇచ్చే కార్యక్రమం ఇకపైన కొనసాగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు తలా 12 కిలోల చొప్పున బియ్యం మాత్రం జూన్ నెలలో కూడా కొనసాగుతుందని పేర్కొంది. ఆసరా పింఛన్లు కూడా యధావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50% కోత, పింఛనుదార్ల చెల్లింపుల్లో 25% కోత ఈ నెలలో కూడా తప్పదని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60శాతం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10శాతం కోత ఈ నెలలో కూడా కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ప్రగతి భవన్‌లో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు ఇచ్చిన వివరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇకపైన అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12 వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ. 982 కోట్లతో కలిపి కేవలం రూ. 3,100 కోట్లు మాత్రమే వచ్చాయి. లాక్‌డౌన్ నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో కూడా ఆదాయం పెద్దగా రాలేదు. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలూ తీరాలి” అని సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కేసీఆర్‌కు నొక్కిచెప్పారు.

ఖజనా ఖాళీ

రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పులకు ఏడాదికి రూ. 37,400 కోట్ల మేర కిస్తీలుగా చెల్లించాల్సి ఉందని, క్రమం తప్పకుండా ప్రతీ నెలా వాయిదాల రూపంలో కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని వారు సీఎంకు వివరించారు. ఈ అప్పుల చెల్లింపులను రీషెడ్యూల్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదని వివరించారు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపు విషయంలో కేంద్రం కొంత అవకాశం ఇచ్చినప్పటికీ అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను పూర్తిగా చెల్లిస్తే రూ. 3000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని, ఇక ఏ అవసరాలకూ చెల్లింపు చేయడం కుదరని, ఖజానా ఖాళీ అవుతుందని నొక్కిచెప్పారు. దీంతో ఏ పనీ చేసే వీలుండదని, ఇందుకోసం తగిన వ్యూహం అనుసరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి పై నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed