హెచ్-1బీ నియామాకాలకు బ్రేక్..

by vinod kumar |   ( Updated:2020-08-04 10:53:59.0  )
హెచ్-1బీ నియామాకాలకు బ్రేక్..
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశంపై మరోసారి షాకిచ్చారు. విదేశీ వర్కర్లను నియమించుకోకుండా ఫెడరల్ ఏజెన్సీలను నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన మంగళవారం సంతకం చేశారు. దీంతో ఈ వీసా ద్వారా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లే భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఇది శరాఘాతం కానుంది. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న ఈ ఏడాది చివరివరకు విదేశీ కార్మికులను అమెరికా సంస్థలు ఉద్యోగంలోకి తీసుకోకుండా హెచ్-1బీ సహా ఇతర రకాల వీసాలను సస్పెండ్ చేస్తూ జూన్ 23న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా, అమెరికా పౌరులకు అధిక ప్రాధాన్యమిచ్చేలా ఫెడరల్ ప్రభుత్వాలు నడుచుకోవడానికి ఉద్దేశించిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఆయన వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అమెరికాలో కష్టపడి పనిచేస్తున్న స్వదేశీయుల స్థానంలో చీప్‌గా లభించే విదేశీ కార్మికులను నియమించుకోవడాన్ని తాను సహించబోనని అన్నారు. అత్యంత నిపుణులైన విదేశీయులకే హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో పనికి అవకాశమివ్వాలని, వారు ఇక్కడ ఉపాధి సృష్టించడానికి తోడ్పడేవారై ఉండాలన్నారు.

అంతేకానీ, ఇక్కడి ఉద్యోగాలను లాక్కునేలా ఉండకూడదని చెప్పారు. హెచ్-1బీ రెగ్యులేషన్‌లతో కూడిన ఇమ్మిగ్రేషన్ బిల్లుపై త్వరలోనే చర్చిస్తామని, మెరిట్ ఆధారంగానే దేశంలోకి విదేశీ వర్కర్లు అడుగుపెట్టేలా ఆ బిల్లు ఉండనుందని వివరించారు. అమెరికన్ ఉద్యోగులకు బదులుగా విదేశీ కార్మికులను హెచ్-1బీ వీసా ద్వారా స్వీకరణకు ఫెడరల్ ఏజెన్సీలపై ఆంక్షలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం పెట్టారు. ఈ ఉత్తరు ప్రకారం, అన్ని ఫెడరల్ ఏజెన్సీలు కాంపిటీటివ్ సర్వీసుల్లో అర్హులైన అమెరికన్లనే నియమించుకున్నారా? లేదా? అనే విషయంపై అంతర్గతంగా ఆడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా హెచ్-1బీ ఉద్యోగులను నియమంచుకోకుండా యాజమాన్యాలను అడ్డుకునే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed