ఏపీ మంత్రులు బయటకొస్తే ప్రజలే చితక్కొడతారు : జీవీ హర్షకుమార్ 

by srinivas |
Harsha vardan
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మంత్రులను ప్రజలు మర్చిపోయే పరిస్థితి నెలకొందన్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అంటేనే మర్చిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఎందుకంటే అన్ని శాఖలకు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మంత్రి అని ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఒక్క దళితుడికైనా రుణం ఇచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు లోన్ ఇచ్చి ఉంటే ఒక్కపేరైనా బయటపెట్టాలని మంత్రి విశ్వరూప్‌కు సవాల్ విసిరారు. అలాగే విదేశీ విద్యను సైతం నిలిపివేశారని ఆరోపించారు.

పేదలకు పంపిణీ చేసే పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్య సీఎం జగన్‌ మాత్రమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మంత్రులు బయటకొస్తే ప్రజలు చితకబాదే సమయం ఆసన్నమైనట్లు ఉందని హర్షకుమార్‌ హెచ్చరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని దళితుల పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలు అత్యాచారాలకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. అత్యాచారానికి గురైన బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని జీవీ హర్షకుమార్ ఆరోపించారు.

రాయలసీమ వరదలతో అతలాకుతలమవుతుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఆదుకోవడం లేదన్నారు. కనీసం వారికి భరోసా ఇచ్చేలా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు మంత్రులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ మంత్రులు బూతుల మంత్రులుగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ బూతుల మంత్రులు బయటకు రావొద్దని.. వస్తే ప్రజలు చితకబాదేస్తారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు మామూలుగా ఉతకరని చెప్పుకొచ్చారు. మీ బూతులను ప్రజలు సహిస్తున్నారని మీరు అనుకుంటున్నారని.. కానీ వారు సమయం కోసం వేచి చూస్తున్నారని జీవీ హర్షకుమార్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed