ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీగా గుత్తా నామినేషన్

by Shyam |   ( Updated:2021-11-16 07:41:47.0  )
ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీగా గుత్తా నామినేషన్
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్టుగానే ఎమ్మెల్యే కోటలో శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించి భంగపడి, ఎమ్మెల్సీ పదవీ కోసం పోటీలో నిలిచిన సీనియర్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డికి మళ్లీ నిరాశే మిగిలింది. మరో అవకాశం కోసం కోటిరెడ్డి ఎదురు చూడక తప్పదని అధికార పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో సాగర్ నియోజక వర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా, గుత్తా అభిమానులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద సంబురాల్లో మునిగిపోయారు.

గులాబీ బాస్ అప్పట్లోనే మాటిచ్చారా..

గుత్తా సుఖేందర్ రెడ్డి దాదాపుగా అన్ని అధికార, రాజకీయ పార్టీల్లో పనిచేశారు. మొదట్లో కమ్యూనిస్టుగా అనంతరం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో వివిధా హోదాల్లో పనిచేశారు. టీడీపీ ఎంపీగా 2004లో, 2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరుపున నల్లగొండ లోక్‌సభ నియోజరవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన టీఆర్ఎస్ అధినేత చేతులతో గులాబీ కప్పుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీతో హోంమంత్రి పదవి ఇస్తానంటేనే గుత్తా గులాబీ కండువా కప్పుకున్నారనే వినికిడి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలనుంచి వినిపించింది. అనుకున్నట్టుగానే 2018 మార్చిలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడి పదవిని గుత్తాకు కట్టబెట్టినా, దానిపై ఆయనకు అంతగా ఆసక్తి లేదని ఆ పార్టీ నేతల్లో ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. 2012లో ఎమ్మెల్యే కోటానుంచి గుత్తాకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రమాణ స్వీకారం చేశారు.

ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది..?

శాసన మండలి చైర్మన్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యలో టీఆర్ఎస్ అధినేతను గుత్తా పలుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 3న గుత్తా పదవీకాలం ముగిసిన వెంటనే ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని, అప్పుడు కూడా గుత్తాకు ఇదే మాట ఇచ్చారని సమాచారం. ఈ ధీమాతోనే గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్ద టెన్షన్ కూడా తీసుకోలేదు. అంతేగాకుండా ఫాంహౌస్ నుంచి నేరుగా వాసాలమర్రిలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఆ రోజంతా ముఖ్యమంత్రితోనే ఉన్నారు. నాటినుంచి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రిని ఎంత పొగిడితే పార్టీలో అంత భద్రత ఉంటుందనే లాజిక్ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలకూ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే కేసీఆర్ మెప్పుకోసం ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ ప్రతి విమర్శ చేశారు.

ఎన్నికల ఖర్చు నిల్.. పదవులు ఫుల్

రెండు దఫాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో గుత్తాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న గుత్తాకు రెండోసారి ఎమ్మెల్సీ వస్తుండటంతో, మళ్లీ ఎన్నికల ఖర్చును తప్పించుకుంటున్నారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా, శాసనమండలి చైర్మన్‌గా పదవులు ఇచ్చినా గుత్తా అయిష్టంగానే ఉన్నట్లు గుసగుసలు వినిపించగా, మంత్రి పదవితో కేబినేట్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమచారం.

Advertisement

Next Story

Most Viewed