- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాట తప్పిన సర్కార్.. మా సత్తా ఏంటో చూపిస్తామంటూ కేసీఆర్‌కు వార్నింగ్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారంతా స్వదేశానికి రారు, ఎన్నికల్లో ఓటు వేయరు, వీరితోమనకేం పని అన్న భావనతో ఉన్న రాజకీయ పార్టీలకు ధీటుగా ఓ వేదిక కావాలని భావిస్తోంది. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటైన వివిధ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి కార్యాచరణకు సిద్దమవుతున్నాయి.
నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న ఆవేదనతో ఉన్న గల్ఫ్ కార్మికులంతా కలిసి సమైఖ్య పోరాటం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. వివిధ వర్గాలను రాజకీయ పార్టీలు ‘ఓటు బ్యాంకు’గా గుర్తించి వారి సమస్యల పట్ల స్పందించిన విధంగా తమను పట్టించుకోవడం లేదన్న భావన గల్ఫ్ కార్మికుల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేయాలని సంకల్పించుకున్న గల్ఫ్ దేశాల కార్మికులు, తిరిగొచ్చిన వారు, వారి కుటుంబాలతో మమేకమై సమర శంఖం పూరించే దిశగా ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది.
మాట తప్పిన సర్కార్..
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్, గల్ఫ్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా, ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వంపై గల్ఫ్ కార్మికులు గుర్రుగా ఉన్నారు.
సామాజిక సేవా స్వభావం కలిగిన వివిధ గల్ఫ్ సంఘాలు, తెలంగాణ గల్ఫ్ జేఏసీ పోరాటాలు చేస్తున్నప్పటికీ వీరి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆయా సంఘాల్లో వ్యక్తమవుతోంది. విపక్షాలు కూడా ఆశించిన స్థాయిలో గల్ఫ్ కార్మికుల పోరాటాలకు మద్దతు ఇవ్వడం లేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో సమరమే.. లక్ష్యాన్ని సాధించగలుగుతుందన్న నమ్మకం వారిలో బలంగా నాటుకుపోయింది.
ఇందుకోసం అన్ని గల్ఫ్ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో చర్చించి ఒక రాజకీయ గల్ఫ్ పోరాట వేదికనైనా లేక రాజకీయ పార్టీ అయినా ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యతను అధికార పక్షం, విపక్షాలు కల్పించాయని అనుకుంటున్నారు. ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ అనే నినాదంతో గరీబు గల్ఫ్ కార్మికులు రాజకీయాల్లో తమ వాటా పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.
గల్ఫ్ బంధు నినాదమే ఊతం..
గల్ఫ్ బంధు స్కీంను అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి గల్ఫ్ కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టిన ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్‌ను ఆయుధంగా మల్చుకొని తెలంగాణ రాజకీయాల్లో తమ సత్తా చాటుతామన్నారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతీ గల్ఫ్ కార్మికుడు తన చేతిలోని మొబైల్ ఫోన్‌తో, వాట్సాప్ కాల్స్‌తో చక్రం తిప్పగలిగే సత్తా ఉందని స్పష్టం చేస్తున్నారు. హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలలో పర్యటించి సెప్టెంబర్ 2న జమ్మికుంటలో జరిగే గల్ఫ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి గల్ఫ్ కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చొరవ తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికే కమలాపూర్‌లో తెలంగాణ గల్ఫ్ బాధిత సంఘం కూడా ఏర్పాటు అయిందని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు సత్వర సాయం కింద ఈ సంఘం రూ. 10 వేలు కూడా అందిస్తోందని వివరించారు. అయితే వ్యక్తులు మాత్రమే ఇలాంటి చొరవ తీసుకుంటే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకే అయినా, తిరిగివచ్చిన వారి కుటుంబాల్లో అయినా.. సమూల మార్పు రాదని, వ్యవస్థ చొరవ తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.
‘దళిత బంధు’ తరహాలోనే ‘గల్ఫ్ బంధు’ పథకం అమలు చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ‘దళితబంధు’ పథకం కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు గల్ఫ్ కార్మికుల పునరావాసం, సంక్షేమం కోసం నిధులు కేటాయించడానికి ఉన్న అడ్డంకి ఏంటో చెప్పాలన్నారు. కొవిడ్ కారణంగా గత సంవత్సర కాలంలో గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏళ్లుగా పోరాటం..
తెలంగాణ ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా ఎదురు చూసిన గల్ఫ్ కార్మికులు తమ ఆగ్రహాన్ని గత లోకసభ ఎన్నికల్లో చూపించారని గల్ఫ్ సంఘం ప్రతినిధులు అంటున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడంలో తమ వంతు పాత్ర పోషించారని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.
వలస జీవితాల గణాంకాలు..
గల్ఫ్ దేశాలకు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్లారు. గత 20 – 25 ఏళ్లలో.. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి స్వగ్రామాల్లో స్థిరపడ్డవారు మరో 25 లక్షల మంది ఉన్నారు. ఒక్కో గల్ఫ్ కార్మికుడికి నలుగురు కుటుంబ సభ్యుల చొప్పున 60 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఒక కోటికి పైగా జనాభాతో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’గా మారి కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.
నిర్లక్ష్యానికి గురైన ఒక కోటి సమూహం భవిష్యత్తులో తెలంగాణలోని 30 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో నాయకుల తలరాతలు మార్చాలన్న సంకల్పంతో వ్యూహ రచన చేస్తోంది. అభ్యర్థుల గెలుపోటములను తీవ్ర ప్రభావితం చేయగల సత్తా వీరికి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వలస కార్మికుల సమస్యలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న తెలంగాణకు చెందిన వలస వ్యవహారాల విశ్లేషకులు, ప్రముఖ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. జాతీయ స్థాయిలోని ఒక బృందం ప్రవాసీ రాజకీయ పార్టీ స్థాపన గురించి కన్సల్టెంట్‌గా పనిచేయాలని భీంరెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.