ఢిల్లీని దాటిపోయిన గుజరాత్..

by vinod kumar |   ( Updated:2020-04-24 11:46:27.0  )
ఢిల్లీని దాటిపోయిన గుజరాత్..
X

వారం రోజుల్లో రెండున్నర రెట్లు

దేశవ్యాప్తంగా 23,452 కేసులు

దిశ, న్యూస్ బ్యూరో:
దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో వేగం తగ్గుతున్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అనూహ్యంగా పెరుగుతుండటం.. చివరకు దేశవ్యాప్త సగటుపై ప్రభావం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో 1752 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,452కు చేరుకుంది. కొత్తగా 37 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 723కు చేరుకుంది. ఇటీవలి కాలం వరకు ఢిల్లీలో కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయనుకునే సమయంలో.. మహారాష్ట్ర ఆ స్థానాన్ని అధిగమించింది. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం ఢిల్లీని దాటిపోయింది. పది రోజుల వ్యవధిలో దేశం మొత్తం మీద కేసులు రెండు రెట్లు పెరిగితే గుజరాత్ రాష్ట్రంలో మాత్రం వారం రోజుల వ్యవధిలోనే రెండున్నర రెట్లు పెరిగాయి.

ఈ నెల 15వ తేదీన దేశంలో మొత్తం కేసులు 11,933 ఉంటే, 24వ తేదీ నాటికి అవి 23,452కు చేరుకున్నాయి. గుజరాత్‌లోమాత్రం ఈ నెల 17న కేవలం వెయ్యి కేసులుంటే ప్రస్తుతం 2,624కు చేరుకున్నాయి. ఇదే సమయానికి ఢిల్లీలో కేసులు 1640 నుంచి 2376కు పెరిగాయి. మృతుల విషయంలోనూ ఢిల్లీలో ఇప్పటివరకు 53 నమోదైతే గుజరాత్‌లో మాత్రం ఆ సంఖ్య 112కు చేరుకుంది. ప్రతీరోజు నాలుగు రాష్ట్రాల్లో సగటున 100 కంటే ఎక్కువ కేసులే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 394, గుజరాత్‌లో 191, ఢిల్లీలో 128, మధ్యప్రదేశ్‌లో 157 చొప్పున 24 గంటల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. గురువారం ఒక్క రోజే 778 కేసులు నమోదుకాగా శుక్రవారం మాత్రం కాస్త ఉపశమనం కలిగించేలా 394 మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6817కు చేరుకుంది. ఇందులో ఒక్క ముంబయి నగరంలోనే నాలుగున్నర వేలు ఉన్నాయి. మృతుల విషయంలోనూ రాష్ట్రం మొత్తం మీద 310 మంది చనిపోతే ముంబయి నగరంలో ఆ సంఖ్య 179. ఆంధ్రప్రదేశ్‌లో సైతం పది రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 14వ తేదీ నాటికి ఆ రాష్ట్రంలో 483 కేసులు నమోదుకాగా.. 24వ తేదీ నాటికి 955కు చేరుకున్నాయి. మృతుల సంఖ్య సైతం ఈ పది రోజుల్లో మూడు రెట్లు పెరిగి తొమ్మిది నుంచి 29కు చేరుకుని తెలంగాణ కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మాత్రం అన్ని రాష్ట్రాల నుంచి గణాంకాలను సేకరించి గడిచిన 14 రోజులుగా 80 జిల్లాల్లో కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని, 15 జిల్లాల్లో 28 రోజులుగా కొత్త కేసులు వెలుగులోకి రాలేదని, రెట్టింపయ్యే గడువు మూడున్న రోజుల నుంచి పది రోజులకు పెరిగిందని, పరిస్థితి అదుపులోకి వస్తోందని సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ తమిళనాడులో మాత్రం చెన్నై, కోయంబత్తూరు, మధురై తదితర నగరాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నందున.. ఈ మూడు నగరాల్లోనూ ఈ నెల 26వ తేదీ నుంచి 29 రాత్రి వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అత్యవసర, నిత్యావసరాలు తప్ప ప్రజలు రోడ్లమీదకు రావడాన్ని నిషేధించింది.

లాక్‌డౌన్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఏయే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, లాక్‌డౌన్ ఫలితాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయడం లేదా పొడిగించడం లేదా ఆంక్షలను సడలిస్తూ దశలవారీగా ఉపశమనం కలిగించడం లాంటి అంశాలపై వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

భారత్ :

మొత్తం కేసులు : 23,452

మృతులు : 723

డిశ్చార్జి : 4814

తెలంగాణ :

మొత్తం కేసులు : 983

మృతులు : 25

డిశ్చార్జి : 291

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 955

మృతులు : 29

డిశ్చార్జి : 145

Tags: India, Telangana, Corona, LockDown, Positive Cases, Delhi, Gujarat, Maharashtra, Mumbai, Tamilnadu

Advertisement

Next Story

Most Viewed