జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు!

by Harish |
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగేలా, వ్యాపారులు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లింపులపై మినహాయింపు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మే నుంచి జులై వరకూ మూడు నెలలు జీఎస్టీఆర్ 3బీ ఫారమ్ దాఖలు చేసే వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని, అది కూడా సెప్టెంబర్ 30 వరకు ఈ అవకాశం ఉండనున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, జీఎస్టీ రిటర్నులను జులై 6లోగా దాఖలు చేసే చిన్న పన్ను చెల్లింపుదారులు వడ్డీ చెల్లించాల్సి అవసరంలేదని చెప్పారు. ఆ తర్వాత దాఖలు చేసే రిటర్నులకు 9 శాతం వడ్డీ రేటు ఉంటుందని తెలిపారు. ఇది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే కొనసాగుతుందన్నారు. 2017 జులై నుంచి 2020 జనవరి వరకు జీఎస్టీఆర్ 3బీ దాఖలు చేయని వారికి ఆలస్య రుసుము గరిష్టంగా రూ. 500 వరకు ఉంటుందని ఆర్థిక మంత్రి వివరించారు. ఇది 2020 జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దాఖలు చేసే అన్ని రిటర్నులకు వర్తిస్తుందని చెప్పారు. ఇదే సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం ఇచ్చే అంశంపై జులైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story