ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధి 30 శాతం

by Shamantha N |
ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధి 30 శాతం
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి వినియోగదారుల్లో మార్పు తెచ్చిన నేపథ్యంలో రానున్న మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ సుమారు రూ. 6.50 లక్షల కోట్ల నుంచి రూ. 7 లక్షల కోట్ల వరకు చేరుకోనుంది. కరోనా వ్యాప్తికి ముందు ఈ-కామర్స్ రంగం వృద్ధి 26-27 శాతంగా ఉండగా, కరోనా అనంతరం 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూరి చెప్పారు. అంతర్జాతీయంగా ఆన్‌లైన్ ఈ-కామర్స్ వాటాలో అధికంగా చైనా 25 శాతాన్ని కలిగి ఉంటే భారత్ 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు 10-25 శాతం మధ్య వాటాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు ఆధునిక రిటైల్ అవకాశాలకు కీలకమైనవి.

చిన్న వ్యాపారులు, చేతి వృత్తులవారు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, వాటిని ఆధునిక రిటైల్ అవకాశాల్లో భాగం చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ తన వంతు కృషి చేస్తోందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. మరి కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్ రంగం ఆధునిక రిటైల్ మార్కెట్ల కంటే పెద్దదిగా ఉండనుందన్నారు. కొవిడ్-19 వల్ల వ్యాపారాలు అధికంగా ప్రభావితం అయ్యాయని, అదే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. 2019 సమయంలో దేశీయంగా మొత్తం జనాభాలో 10 శాతం మాత్రమే ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపారని, గతేడాది కరోనా వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో నిత్యావసరాలతో పాటు కిరాణా కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ వేదికనే ఎంచుకొన్నారని కృష్ణమూర్తి వివరించారు. ఈ ఏడాది నుంచి ఈ ధోరణి సాధారణమవుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed