టీఆర్ఎస్‌పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనం

by Anukaran |
Membership registration, TRS leaders
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోంది. నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఆరున్నరేండ్లుగా నిరాశే ఎదురవుతోంది. దీంతో ఏటికేడు తెలంగాణ ప్రజల్లో మార్పు వస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ ఓటుతోనే కనువిప్పు కలిగించాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది.

భారీగా తగ్గిన మొదటి ప్రాధాన్యత ఓట్లు..

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీని 2016 ఎన్నికలతో పోల్చితే 2021 సంవత్సరంలో భారీగా ఓట్లు తగ్గాయనే చెప్పాలి. వాస్తవానికి సంఖ్యాపరంగా ఈ ఎన్నికల్లో ఓట్లు పెరిగినా, శాతం పరంగా చూస్తే భారీగా తగ్గిందనే చెప్పాలి. అప్పుడు 38.2 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, ఇప్పడు 30.25 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇతర ఎన్నికల్లోనూ..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మొత్తం పోలైన ఓట్ల(1,63,401ఓట్లు)లో 89,299(54.36శాతం) ఓట్లు సాధించి జయకేతనం ఎగరేశారు. కానీ రెండేండ్లు గడవకముందే ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఉపఎన్నికలో మొత్తం 1,98,807 ఓట్లలో కేవలం 62,022 ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇక 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 43.85 శాతం ఓట్లు వస్తే, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 30.79 శాతమే వచ్చాయి. వీటిని చూస్తుంటే ప్రజలకు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకం క్రమంగా తగ్గుతోందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed