భూ గర్భంలో జలకళ..

by Shyam |
భూ గర్భంలో జలకళ..
X

గంగమ్మ కరుణించింది. పాతాళం వదిలి నెమ్మదిగా పైపైకి కదిలివచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే సగటున 1.90మీట్లర్లు పైకి రావడం శుభసూచకం. వరుస ముసుర్లకు వాననీరు క్రమంలో భూమిలోకి ఇంకింది. చెరువులు, కుంటలు నిండిపోయాయి. జలాశయాలకు కళ వచ్చింది. దీంతో అన్నదాత మోములో ఆనందం తొణికిసలాడుతోంది. బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో పంటలకు ఢోకా లేదని భావిస్తున్నారు. ‌‌

దిశ ప్రతినిధి, మేడ్చల్ : పాతాళ గంగ ఉబికి వచ్చింది. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాల మట్టం భారీగా పెరిగింది. జూలై మాసంతో పోల్చితే జిల్లాలో సగటున 1.90 మీటర్లు పైకి వచ్చింది. జూలైలో 12.14 మీటర్ల లోతులో ఉంటే ప్రస్తుతం 10.27 మీటర్లు పైకి వచ్చాయి. గతేడాది 2019 ఆగస్టు మాసంలో 14.59 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 10.27 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వారం రోజులపాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. దీంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. మేడ్చల్ జిల్లాలో ఆగస్టు మాసంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. జూలై మాసంతో పోల్చుకుంటే సగటున 1.90 మీటర్ల నీట మట్టం పెరిగిందని భూగర్భ జల శాఖ అధికారి రేవతి వెల్లడించారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టాలి..

జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి ఒక్కరు తమవంతు విధిగా ఇండ్లలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఇంటిలోని వర్షపు నీరు ఒడిసిపట్టాలి. ఇలా చేస్తే నీటి ఎద్దడిని నివారించవచ్చు. – రేవతి, జిల్లా భూగర్భజల శాఖాధికారి మేడ్చల్

Advertisement

Next Story

Most Viewed