పొల్యూషన్ టాప్‌లో గ్రేటర్ హైదరాబాద్

by Anukaran |
పొల్యూషన్ టాప్‌లో గ్రేటర్ హైదరాబాద్
X

ఒకటి, రెండు ఫార్మా కంపెనీలుంటేనే దాదాపు 15 కి.మీ. మేర భూగర్భ జలాలు విషతుల్యమవుతాయి. వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అలాంటిది వేల సంఖ్యలో ఔషధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే చుట్టూ వంద కి.మీ. వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఇప్పటికే కాలుష్యం వెదజల్లడంలో నగరం టాప్‌లో ఉంది. దీనికి తోడు సిటీకి అత్యంత చేరువలో ఉన్న ముచ్చర్ల‌లో సర్కారు ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతోంది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఆదిభట్ల ప్రాంతాల నివాసితులకు భవిష్యత్తులో తీవ్ర ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ముచ్చర్ల ఫార్మా కంపెనీని ఎత్తివేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ప్రస్తుతం నగరంలో ఉన్న జీడిమెట్ల, కూకట్‌పల్లి, బాలానగర్, చౌటుప్పల్, కొత్తూర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఆయా పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థజలాలు, దుర్గంధం, విషవాయువులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక రోగాల బారిన పడుతున్నారు. అక్కడ బోర్లు వేస్తే విషపు జలాలు ఉబికి వస్తున్నాయి. దీనికి కారణం ఫార్మా కంపెనీల పుణ్యమేనని పర్యావరణ వేత్తలు వివరిస్తున్నారు. ఫార్మా కంపెనీల పరిధిలో జీవించే ప్రజలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు జబ్బు పడినప్పుడు అధిక మోతాదులో ఉండే మందులను వాడాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రజలకు వివరించకుండానే సర్కారు పొల్యూషన్ లేని ఫార్మా కంపెనీలు వస్తున్నాయని ప్రజలను మభ్య పెడుతోంది. పెద్ద పెద్ద దేశాల్లో ఎందుకు ఫార్మా కంపెనీలు స్థాపించడం లేదు.. అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. యూరోపియన్, అమెరికా లాంటి దేశాల్లో డ్రగ్ ఫార్మాసిటీ కంపెనీలు లేవు.. కానీ అక్కడి ప్రజలు జబ్బు పడితే మన దేశంలోని హైదరాబాద్ కంపెనీల నుంచి ఎగుమతయ్యే మందులనే అత్యధికంగా వినియోగిస్తోంది. ప్రజారోగ్యాలను, ప్రజల జీవన విధానాలను పరిగణనలోకి తీసుకోకుండా లాభాలను మాత్రమే ఆశించి ఫార్మా కంపెనీలు పెట్టడంతో భూగర్భ జలాలు విషపూరితంగా మారిపోయి, ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు.

మెట్రో నిలిచింది.. మరి విమానాలు ఎగిరేనా..?

కాలుష్యంతో మెట్రో జర్నీకి తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏండ్లుగా ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను మూసీలో పారబోస్తున్నాయి. ఇటీవల మెట్రో రైలు నడిచేటప్పుడు ఆగిపోయింది. దీనిపై నిపుణులు అధ్యయనం చేస్తే వ్యర్థ జలాల నుంచి వచ్చిన తేమ గాలిలో కలిసింది. ఇది మెట్రో సర్క్యూట్ బోర్డులపై చేరడంతో మెట్రో జర్నీకి బ్రేక్ పడిందని నివేదికలో స్పష్టం చేశారు. అంటే మెట్రో రైలుకే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదీకూడా ఎక్కడో పోసిన వ్యర్థ జలాలు తేమ రూపంలోకి మారి మెట్రో ఆగిపోతోంది. అలాంటిది ముచ్చర్ల ఫార్మాసిటీ ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలో ఉంది. ఈ ఔషధ కంపెనీల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో విమానాలు ఎగిరేందుకు ఇబ్బందులు లేకపోలేదని నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే విమానాలకు గాలి ఎంతో ముఖ్యం.. అలాంటి స్వచ్ఛమైన గాలికీ విషపు గాలి తోడైనప్పుడు ఎయిర్ లైన్లు.. సెన్సార్లు పనిచేనే అవకాశం ఉండదు. దీంతో విమానాలు ఎగిరేందుకు సాంకేతిక సమస్యలు తప్పవు.

అత్యధిక ప్రమాదకరంగా మహానగరం

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో హైదరాబాద్ మహానగరం ఫార్మా కంపెనీలతో తీవ్రంగా కలుషితమైందని వెల్లడించింది. సెఫీ స్కోర్‌లో టాప్-5లో ఉంది. ఈ సెఫీస్కోర్ ‌ను వాయు, వాతావరణ, జల, శబ్ధ కాలుష్యం ఆధారంగా నిర్ధారిస్తారు. పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, జీడిమెట్ల, కాటేదాన్, కూకట్‌పల్లి అత్యంత ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతాలుగా గుర్తించింది. అక్కడ వెలువడే గాలి కాలుష్యంతో ప్రజలు మతిస్థిమితం కోల్పోతారు. ఆలోచించడం మరిచిపోతారు.. రాత్రి సమయంలో డోర్లు మూసుకోవడంతో ఆక్సిజన్ శాతాన్ని కోల్పోతారు. దీంతో శ్వాస సంబంధ వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది.

ఇళ్లు ఖాళీ చేయాల్సిందే..

బొల్లారం, పటాన్‌చెరు, పాశంమైలారం, మేడ్చల్, కాటేదాన్ ప్రాంతాల్లోని ప్రజలు విష వాయువుల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీతో రాజేంద్రనగర్, శంషాబాద్, బాలాపూర్, మహేశ్వరం, బీఎన్ రెడ్డి, తుర్కయంజాల్, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో నివాసం ఉండలేరు. ఎందుకంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు దిగువ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి.

చట్టాల అమలులో నిర్లక్ష్యం

ఫార్మా కంపెనీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. యూరోపియన్, అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు కఠినంగా అమలు చేస్తారు. అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు కావు. కానీ మన ప్రభుత్వాలు ఎన్‌బీటీ, కోర్టు తదితర ఆదేశాలనూ పట్టించుకోవు. కంపెనీలు ఇచ్చే సూచనలు పాటిస్తాయి. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదు.
– ప్రొఫెసర్ పురుషోత్తం‌రెడ్డి, పర్యావరణ వేత్త

స్థానికులు వ్యతిరేకిస్తున్నారు..

ఈ ఫార్మాసిటీ లోపల నివాస ప్రాంతాల గురించి ప్రభుత్వం చేసిన కార్యాచరణ శూన్యం. అక్కడి రైతులు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వారికి సరియైన ప్రణాళిక ఇవ్వకుండా భూములు లాక్కోవడం సమంజసం కాదు. ఫార్మా కంపెనీలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యానికి గురికాక తప్పదు. గ్రామ జ్యోతి కార్యక్రమంలో స్థానికులు ఫార్మా కంపెనీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
-ప్రొఫెసర్ నరసింహారెడ్డి, పర్యావరణ విశ్లేషకుడు

Advertisement

Next Story

Most Viewed