గ్రేటర్‌ ఎఫెక్ట్‌.. తిరుపతిలో బీజేపీ..?

by Anukaran |   ( Updated:2020-12-06 01:01:15.0  )
గ్రేటర్‌ ఎఫెక్ట్‌.. తిరుపతిలో బీజేపీ..?
X

దిశ, ఏపీ బ్యూరో: మొన్న దుబ్బాక, నేడు గ్రేటర్ ​హైదరాబాద్​ ఎన్నికలు తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్​కు ముచ్చెమటలు పట్టించాయి. ఈ ఫలితాలతో ఏపీలోని ప్రధాన రాజకీయపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. రానున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డాయి. సోషల్​ ఇంజినీరింగ్, ఓట్ల పునరేకీకరణతో విజయఢంకా మోగిస్తామని బీజేపీ, జనసేన పార్టీలు జోష్​తో ఉండగా, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయనే భరోసాతో అధికార వైసీపీ ఉంది. మరోవైపు బీజేపీ విధానాలపై ప్రతిపక్ష టీడీపీ గొంతు సవరించుకుంటోంది. ఢిల్లీలో ఉత్తరాది రైతులు చేస్తున్న ఆందోళనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నోరు విప్పారు. మొత్తంగా పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలతో ఏపీ రాజకీయాలు ఒకింత ఉలికిపాటుకు గురవుతున్నాయి.

వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి:

గత 18 నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో తమకు తిరుగులేదనే భావన వైసీపీ అధిష్టానంలో నెలకొంది. ఏ పార్టీ కూడా రాష్ట్రంలో తమను నిలువరించలేదనే ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో టీడీపీని బలహీన పర్చే ఎత్తుగడలతో ముందుకు సాగింది. తాజాగా, సోషల్​ మీడియాను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, తొమ్మిదేళ్లపాటు పార్టీ జెండాను మోసిన తమకు కనీస విలువ ఇవ్వడం లేదనే భావన కిందిస్థాయి యంత్రాంగంలో నెలకొంది. ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా తీవ్రమైన అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. సోషల్​ మీడియా కార్యకర్తల్లోనూ ఇలాంటి నిస్పృహలే బయటపడుతున్నాయి. తొలి నుంచీ రైలు పట్టాల్లాగా పార్టీని, ప్రభుత్వాన్ని పరస్పర జోక్యంతో నడపాలనే విధానానికి జగన్ ​అంత ఆసక్తి కనబరచలేదు. ప్రజలకు, తనకు మధ్య ఎవరి అవసరం లేదనే భావన కనిపించింది. రానున్న స్థానిక, తిరుపతి ఉప ఎన్నికల్లో మునుపటి ఉత్సాహంతో పార్టీ యంత్రాంగం పనిచేస్తుందా అనే సందేహాలు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను సవరించుకోవాల్సిన అవసరముందని పార్టీ క్యాడర్​లో బలంగా వినిపిస్తోంది.

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై ఇన్ని రోజులుగా నోరు విప్పని చంద్రబాబు శనివారం స్పందించారు. రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఆయా చట్టాల్లో సవరణలు చేయాలని కేంద్రానికి వినిపించీ వినిపించనట్టు గొంతు సవరించుకున్నారు. అయితే, అధికారానికి దూరమయ్యామన్న ఆక్రోశం నుంచి ఆ పార్టీ యంత్రాంగం ఇంకా బయటపడినట్టు కనిపించడం లేదు. ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ప్రభుత్వ విధానాలపై న్యాయ స్థానాల్లో కేసులు, అమరావతి చుట్టే తిరిగారు. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన 35 లక్షల కౌలు రైతు కుటుంబాల్లోని కొంతమందిని చంద్రబాబు, ఆయన తనయుడు కలిసినా నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టలేదు. ఈ అంశాన్ని కనీసం శాసనసభలో ప్రస్తావించడానికీ ఆసక్తి చూపలేదు. మొత్తంగా కిందిస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం లేక పార్టీలో స్తబ్దత నెలకొంది.

బీజేపీ, జనసేన దూకుడు:

అధికార, విపక్షాల వైఫల్యాలతో తాము బలపడతామనే ధీమాతో బీజేపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ తమను బలంగా విమర్శించలేని బలహీనతలతో రాష్ర్టంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి బీజేపీ అడుగులు వేస్తోంది. ఈపాటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ఆధ్మాత్మిక కేంద్రంలో ఏదైనా చర్చనీయాంశం చేయగల సత్తా తమకుందని బీజేపీ నిరూపించింది. అంతేకాకుండా, ఆలయాలపై దాడులను నిరోధించేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా ఎండగడుతోంది. ఆ రెండు సామాజిక వర్గాల పెత్తనాన్ని బాహాటంగానే విమర్శిస్తోంది. తద్వారా మిగతా ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకుంటోంది. దుబ్బాకలో అధికార పార్టీని ఓడించారు. గ్రేటర్​హైదరాబాద్​ ఎన్నికల్లో నాలుగు సీట్ల నుంచి 48 సీట్లకు ఎగబాకారు. ఇదే ఊపుతో తిరుపతిలోనూ పాగా వేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిఅస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీతో కొనసాగడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది. మొత్తానికి రాబోయే స్థానిక, ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎత్తుగడలను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed