ఈసారి గ్రాండ్‌గా కేసీఆర్ బర్త్‌ డే సెలబ్రేషన్స్..!

by Anukaran |
ఈసారి గ్రాండ్‌గా కేసీఆర్ బర్త్‌ డే సెలబ్రేషన్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా జరగనున్నాయి. వచ్చే నెల 17వ తేదీన జరిగే ఈ వేడుకలను ఈసారి గ్రాండ్‌గా జరపాలనే పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. పార్టీ నేతలు ఇప్పటికే ఆ మేరకు స్టేడియం నిర్వాహకులకు సమాచారం ఇచ్చి ఫిబ్రవరి 17ను రిజర్వు చేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తన ‘బర్త్ డే’ను కేవలం ప్రగతి భవన్‌కు మాత్రమే పరిమితం చేసుకున్నారు. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కుగానీ, మరో వేదికకుగానీ అవకాశం ఇవ్వలేదు.

కానీ ఈసారి మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా ఎల్బీ స్టేడియంలో జరగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ‘బర్త్ డే’ వేడుకల గురించి కొద్దిమంది పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. మూడు రోజుల క్రితం ప్రగతి భవన్‌లో ఒక సమావేశం సందర్భంగా వచ్చిన వారు అవకాశం తీసుకుని కేసీఆర్‌తోనే చర్చించారు. ఎందుకు ఘనంగా జరపాలనుకుంటున్నారు, ఎలా జరపాలి తదితర అంశాలపై వారితో కేసీఆర్ కూడా చర్చించారు. అయితే కేసీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చర్చను అర్ధాంతరంగా ముగించినట్లు సీనియర్ నేత ఒకరు ‘దిశ’కు వివరించారు. అయినా పార్టీ నేతలు మాత్రం ఘనంగానే జరపాలని భావిస్తున్నారు.

కేటీఆర్ సీఎం ఊహాగానాల నేపథ్యంలో

త్వరలో కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పజెప్పబోతున్నట్లు పార్టీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఈసారి గ్రాండ్‌గా నిర్వహించాలని భావించడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో ‘బర్త్ డే’ వేడుకలను జరుపుకోవడం బహుశా ఇదే చివరిసారి కావచ్చని పార్టీ నేతలు భావించడం ఇందుకు కారణం కావచ్చు. ఈ వేడుకలకు సీఎం హాజరవుతారనే ఆ నేతలు బలంగా నమ్ముతున్నారు. ప్రతీ సంవత్సరం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు రక్తదానం, అన్నదానం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, సామాజిక సేవా కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లాంటివి జరిగేవి. ఈసారి అదనంగా ఎల్బీ స్టేడియంలో ఢిఫరెంట్‌గా నిర్వహించాలనుకుంటున్నారు.

నగరం నుంచి మాత్రమే కాకుండా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఇందులో భాగం పంచుకునేలా జిల్లా నాయకత్వానికి కూడా రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేయనున్నారు. అయితే కేసీఆర్ నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఎంత సంఖ్యలో శ్రేణులను రప్పించాలనేదానిపై స్పష్టత ఏర్పడుతుంది. ఇంకా ఇరవై రోజులకు పైగా సమయం ఉన్నందున ఫిబ్రవరి రెండో వారంలో దీనిపై నిర్దిష్ట సమాచారం కేసీఆర్ నుంచి వస్తుందని ఆ నేతలు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed