ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొనాలి : వైఎస్ షర్మిల

by Sridhar Babu |
Sharmila
X

దిశ, నకిరేకల్: రైతులు పండించే ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రైతుల కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఆమె నకిరేకల్‌లో విలేఖరులతో మాట్లాడారు. 21 రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లో ప్రజాప్రస్థానం యాత్ర జరిగిందని, ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిపివేశామని వివరించారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇరవై ఒక్క రోజు పాదయాత్రలో 150 గ్రామాల్లో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చయన్నారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా ఆత్మహత్యలు చేసుకుంటే నిస్సిగ్గుగా మాట్లాడటం ముఖ్యమంత్రికి సిగ్గుచేటన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అయోమయానికి గురి చేయడం సరికాదన్నారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఏ పంట పండించిన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి వరి సాగు చేయొద్దని చెప్పడం సరైందేనా అని ప్రశ్నించారు. రైతులు ఎవరు అధైర్య పడొద్దని, చివరి గింజ కొనేంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed