- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు రూ.25 కోట్ల సహాయం అందించాలి: టీయూడబ్ల్యూజే
దిశ, హైదరాబాద్ : కొవిడ్ -19 నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టులకు రూ.25 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను టీయూడబ్ల్యూజే బృందం గురువారం కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో మీడియా సంస్థలు, జర్నలిస్టులు అనేక ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని, ఈ కష్ట కాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, వేతనాలలో కోత విధించడం లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, యాజమాన్యాలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగులను తొలగించడం, కనీసం నష్ట పరిహారం చెల్లించకుండా కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మీడియా సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కార్మిక చట్టాలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా న్యూస్ కవరేజీలో ప్రతి జర్నలిస్టు పూర్తి రక్షణలో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా జర్నలిస్టులందరికీ మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్ లను అందజేయాలన్నారు.
జర్నలిస్టులు అందరికీ రూ. 20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, కంటైన్మెంట్, రెడ్ జోన్లలో రిపోర్టింగ్ చేస్తున్న వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని వారు కోరారు. గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు రెండు నెలల పాటు నెలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్ర యాజమాన్యం చేతులలో ఉన్న పత్రికలు, ఛానళ్లు సింహభాగం ప్రకటనలు చేజిక్కించుకుంటున్నాయని, ఇక నుంచి తెలంగాణ మీడియాను ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. జర్నలిస్టులందరికీ జారీ చేసిన హెల్త్ కార్డులను అన్ని ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం అందేలా, టెస్టులకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టాలని, ఈ విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి, జర్నలిస్టు సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు వినతిపత్రం అందించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెంజూ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, కోశాధికారి పాండురంగారెడ్డి, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ అధ్యక్షులు పి.యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్, నాయకులు సంపత్, యూసుఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags: corona effect, TUWJ, Media Academy, lock down, journalist health scheme