పొలిటికల్ పవర్.. అధికారులకు ఫీవర్

by Shyam |
పొలిటికల్ పవర్.. అధికారులకు ఫీవర్
X

దిశ ప్రతినిధి , నిజామాబాద్ : ఉద్యోగం చేయాలంటే వారు చెప్పినట్టు వినాలే.. లేదంటే శంకరగిరి మన్యాలే.. ఎంతటి ఉద్యోగి అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ముందు మోకరిల్లకుండా, కాదు, కూడదు అని ఎదురు తిరిగితే మరునాడు డ్యూటీ ఎక్కడ చేస్తారో వారికే తెలియని పరిస్థితి.. వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తూ, చెప్పినట్టు నడుచుకుంటే జాబ్​ సాఫీగా సాగుతుందని, లేదంటే చివాట్లు బోనస్​గా, బదిలీలే బహుమానంగా అందుకోవాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.. ప్రజాప్రతినిధుల తీరుతో కనీస విధులు నిర్వర్తించలేకపోతున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఓ మహిళా ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం చేసుకుందంటే ఒత్తిళ్లు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత..

ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ప్రజలకు అందజేసే అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో నలిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి ఐదేళ్ల పాలనలో ఆఫీసర్లపై పెద్దగా ఒత్తిళ్లు లేకపోయినా రెండో పర్యాయం మాత్రం సదరు వ్యక్తులు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. జిల్లాలో ఇటీవల కొందరు అధికారులు వచ్చినట్లే వచ్చి బదిలీపై వెళ్లడం, ఉన్న ఉద్యోగులను డిప్యూటేషన్లపై బదిలీ చేయడం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అప్పగించిన పని చేయలేక బదిలీ అయిన ఘటనలు జిల్లాలో సర్వసాధారణమయ్యాయి. జిల్లా స్థాయి అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే కింది స్థాయి అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరుగుతున్న పలువురు అధికారుల బదిలీలు, సస్పెన్షన్ల వెనుక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే ప్రధాన కారణమని తేటతెల్లమవుతోంది. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారు పనిచేయాలా.. లేదా ఒత్తిళ్లకు బయపడి బదిలీపై వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్ జిల్లా రెంజల్ ఎంపీడీవో గోపాలకృష్ణను డిప్యూటేషన్ పై ఎడపల్లికి బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు తన మాట వినడం లేదని ఓ ఎంపీటీసీ భర్త నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి బదిలీ చేయించారనే ఆరోపణలున్నాయి. నెల రోజులు గడిస్తే ఉద్యోగ విరమణ చేయాల్సిన గ్రూప్ వన్ స్థాయి అధికారిని ఉన్నఫలంగా డిప్యూటేషన్ పై బదిలీ చేయడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది.

గడిచిన ఏడాది కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా టీఎస్ పీఎస్ సీ ద్వారా నియమితులైన గంగాధర్ విధుల్లో చేరిన నెల రోజులకే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. చెప్పినట్టు వింటేనే కమిషనర్ గా పని చేయాలని, లేకపోతే సెలవులో వెళ్లాలని అక్కడి ప్రముఖ ప్రజాప్రతినిధి పలువురు పార్టీ నేతల ముందే దుర్భాషలాడాడు. దీంతో అతను ఏకంగా లాంగ్ లీవ్ పెట్టాడు. శాశ్వత కమిషనర్ లేక ఇన్​చార్జిలతో నెట్టుకొస్తున్న సమయంలో రెగ్యూలర్​కమిషనర్ ను నియమిస్తే ప్రజాప్రతినిధి ఒత్తిడితో యువకుడైన అధికారి సెలవులో వెళ్లిపోవడంతో ఉద్యోగులను విస్మయపరిచింది.

గత సంవత్సరం రోడ్లు, భవనాల శాఖలో కీలకంగా పని చేసిన ఈఈ స్థాయి అధికారి పాలమూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఉద్యోగ విరమణ సమయం దగ్గర్లోనే ఉందని కినుకు వహించిన నిజామాబాద్ కు చెందిన సదరు అధికారి ఏకంగా లాంగ్ లీవ్ పెట్టి విధులకు దూరంగా ఉంటున్నారు. బదిలీ కారణం.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి సదరు అధికారి సహకరిస్తున్నారని జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి తెరవెనుక తతంగం నడిపాడని రోడ్లు భవనాల శాఖ మొత్తం కోడై కూస్తోంది.

కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని డిప్యూటేషన్ పై మోపాల్ కు బదిలీ చేశారు. జిల్లాలో సీనియర్ అధికారిగా పేరు గాంచిన ఆయనను ప్రమోషన్​సమయంలో బదిలీ చేయడం మండల పరిషత్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. మరో మహిళ అధికారినిని జక్రాన్ పల్లి నుంచి సిరికొండకు డిప్యూటేషన్ పై బదిలీ చేయడంతో ఆమె మనస్థాపం చెంది ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి చేసి అధికారుల ద్వారా అవసరం లేకున్నా డిప్యూటేషన్ల పేరుతో బదిలీ చేయడం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని పెంచింది.

ఈ నెల మొదటి వారంలో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో, డిచ్ పల్లి సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ ప్రజాప్రతినిధికి జారీ అయినా నాన్ బెయిలబుల్ వారెంట్ ను అమలు చేయకపోవడం, పలు కేసులను విచారణ చేయకుండా అటకెక్కించడమే ప్రధాన కారణం. సదరు ప్రజాప్రతినిధి చెప్పినట్టు నడుచుకున్నప్పటికీ ఇటీవల ప్రజాప్రతినిధుల కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా పరిష్కరిస్తున్న సమయంలో పెండింగ్ కేసుల వ్యవహారం కారణంగా పోలీసు శాఖలో ఇద్దరు అధికారులు బలి కావడంతో ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. ప్రజాప్రతినిధులు చెప్పినట్టు నడిచినా తమ ఉద్యోగాలకు, విధులకు గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడిందని సీఐ, ఎస్సైల సస్పెన్షన్​ను ఉదహరించుకుంటున్నారు.

విద్యుత్ శాఖలో ఓ అధికారిని బదిలీ చేయాలని ఏకంగా ఆ సంస్థ ఉన్నతాధికారులకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం కలకలం రేపుతోంది. సదరు అధికారి చేసిన తప్పేంటంటే ప్రజాప్రతినిధికి చెందిన క్వారీకి సంబంధించిన విద్యుత్ బకాయిల కోసం ఒత్తిడి తేవడమే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తన అనుచరుడికి సంబంధించిన క్వారీకి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని, బకాయిల కోసం కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తేవడం.. ఈ కారణంతో బదిలీ చేయాలని పైఅధికారులకు సిఫారసు చేయడం విద్యుత్​శాఖ ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది.

Advertisement

Next Story

Most Viewed