నేషనల్ పెన్షన్ చందాదారులకు ఊరట!

by Harish |
నేషనల్ పెన్షన్ చందాదారులకు ఊరట!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాణాంతకమైన కొవిడ్-19 సోకిన చందాదారులు తమ జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్) నుంచి నిధులను తీసుకోవచ్చని పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఆర్‌డీఏ) ప్రకటించింది. కొవిడ్-19 మహమ్మారిని అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తించినట్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుత్న్న కారణంగా ఎన్‌పీఎస్ నుంచి చికిత్స కోసం కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులతో పాటు, దేశంలోని కార్పొరేట్‌లు, ఎన్‌పీఎస్‌లో సభ్యులుగా ఉన్నవారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంటి సభ్యుల కోసం, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల కోసం, వారికి చికిత్స అందించేందుకు చందాదారులు ఎన్‌పీఎస్ ద్వారా ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తున్నామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులను ఇచ్చింది. ఈ నగదు ఉపసంహరణకు గానూ వైద్య సంబంధిత ధృవీకరణ పత్రం తప్పనిసరి అని వివరించింది.

అయితే, ఈ ఉపసంహరణ అటల్ పెన్షన్ యోజన చందాదారులకు వర్తించదని అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం, ఏపీవై చందాదారులకు పాక్షిక ఉపసంహరణలు కల్పించే నిబంధనలు లేవని పీఎఫ్ఆర్‌డీఏ స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్, అటల్ పెన్షన్ యోజన రెండు పథకాలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఎన్‌పీఎస్, ఏపీవై పథకాల్లో మొత్తం చందాదారుల సంఖ్య 3.46 కోట్లుగా ఉంది. ఇందులో ఏపీవై చందాదారుల సంఖ్య 2.11 కోట్లు అని పీఎఫ్ఆర్‌డీఏ గణాంకాలు చెబుతున్నాయి.

Tags: Pension Fund Regulatory And Development Authority Of India, National Pension System, Treatment Of COVID-19, EPFO, Atal Pension Yojana

Advertisement

Next Story