జర్నలిస్టులను ఆదుకోవాలి : అల్లం నారాయణ

by Shyam |
జర్నలిస్టులను ఆదుకోవాలి : అల్లం నారాయణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ విపత్కర సమయంలో జర్నలిస్టులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. న్యాయవాదులను ఆదుకున్న విధంగా తెలంగాణ జర్నలిస్టులకు రూ.25 కోట్ల తక్షణ సాయం అందించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మీడియా సంస్థలు అనేక ఆటుపోట్లకు గురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం బాధ్యతగా మీడియా రంగాన్ని రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర సర్వీసు లైన వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా 24 గంటలు ప్రమాదకర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతో పాటు మీడియా సిబ్బంది కూడా కనీసమైన రక్షణ లేని పరిస్థితులలో పని చేస్తున్నారని తెలిపారు. అందువలన మీడియాను అత్యవసర సేవలుగా పరిగణించి భీమా సౌకర్యం, రక్షణ సౌకర్యాలు కల్పించాలని అల్లం నారాయణ, కేసీఆర్‌ను లేఖలో కోరారు.

గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి క్రింద ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించి రూ.34.50 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేయడం జరిగిందని గుర్తుచేశారు. మిగతా రూ.65.50 కోట్లు తక్షణమే విడుదల చేస్తే మీడియా అకాడమి కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రకటనలు జారీ చేయాలని కోరారు.

Advertisement

Next Story