ప్రభుత్వ అధికారుల నిర్వాకం.. దానికోసం బతికున్నవారిని అలా చేసి..

by Sridhar Babu |   ( Updated:2021-07-23 02:23:39.0  )
ప్రభుత్వ అధికారుల నిర్వాకం.. దానికోసం బతికున్నవారిని అలా చేసి..
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ లో ఘరానా మోసం జరిగింది. బతికి ఉన్న రైతు పేరిట రైతుభీమా మంజూరైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసి సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ (58) అనే మహిళ వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. అయితే తాజాగా ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఆమెను చంపేశారు అంటే.. రైతు భీమా పథకం కింద వచ్చే ఐదు లక్షలు కోసం. మృతిచెందిన రైతుల కుటుంబానికి సహాయపడడానికి ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు భీమాకు దరఖాస్తు చేశారు.

చంద్రమ్మ కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశారు. తల్లి రైతుబంధు పడడం లేదని వ్యవసాయ అధికారులను బాలయ్య ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. మీ అమ్మ చనిపోయింది.. అందుకుగాను ఐదు లక్షల రైతు భీమా నీ అకౌంట్లో పడిందన్న వ్యవసాయ అధికారుల మాటలకు షాక్ అయిన కొడుకు, తన తల్లి బతికేవుందని తెలపడంతో వీరి గుట్టురట్టు అయ్యింది. ఈ ఘటనపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed