గీత కార్మికుల రాత మారేనా?

by Shyam |   ( Updated:2021-06-10 22:50:35.0  )
Kallu
X

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకే ప్రమాదకరం… క్షణ క్షణం భయం భయం… తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లిన గీతకార్మికుడు క్షేమంగా తిరిగొస్తాడో రాడో అన్న ఉత్కంఠ… నిజాం సుదీర్ఘ పాలన నాటినుంచీ ఇప్పటికీ వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్నారు గీత కార్మికులు. వారి జీవితాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఆధునిక హంగుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వీరి వృత్తిని చెట్ల రూపంలో నరికేస్తుండగా, మరో వైపు మొగిపురుగు తాకి గ్రామాల్లో తాటి, ఈతచెట్లు అంతరించిపోతున్నాయి. బెల్టుషాపుల అనుమతితో మద్యం ఏరులై పారుతుండటంతో కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికులకు ఉపాధి కరువైంది. దుర్భర జీవితాలు గడుపుతున్నారు.

తెలంగాణలో గీత వృత్తిపై సుమారు 75 లక్షలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. 4366 సొసైటీలు, 3709 టీపీటీల ద్వారా 2,18,107 మంది సభ్యత్వం కలిగి వృత్తిచేస్తున్నారని అధికారుల లెక్కలు. సుమారు 30 కోట్ల తాటి చెట్లున్నట్లు అధికారుల అంచనా. ఏటా వేసవి సీజన్‌ ప్రారంభం నుంచి జూన్‌ నెల ఆఖరి వరకూ తాటికల్లు లభిస్తుంది. ఈ కాలంలో వచ్చిన ఆదాయంతోనే గీత కార్మిక కుటుంబాలు ఏడాది పొడుగునా జీవనం సాగిస్తాయి. ఉదయం లేచింది మొదలు ఎండను సైతం లెక్క చేయకుండా రోజుకు మూడు సార్లు గీత కార్మికులు తాటిచెట్లను ఎక్కుతారు. ఉదయం, సాయంత్రం కల్లు తీస్తారు. మిట్టమధ్యాహ్నం వేళ కల్లు దిగుబడికి అనుగుణంగా చెట్టుకు గీత పెడతారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. తీసిన కల్లును తాటి చెట్ల సమీపంలో… లేక ఇళ్ల వద్ద అమ్మకాలు సాగిస్తారు. పైగా రెక్కలు ముక్కలు చేసుకుని శరీరబాధలు అనుభవించి చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్లో డిమాండ్‌ లేక ఆత్మహత్యల పాలవుతున్న గీత కార్మికులను ఆదుకునే యంత్రాంగం లేదు. పైగా తెలంగాణ గీత కార్మికులకు ప్రపంచీకరణ పుణ్యమా అని గౌడ వృత్తి దెబ్బతింటోంది.

Death

బెల్టు షాపులతో వృత్తిపై ప్రభావం…

తాటిచెట్టు ఎక్కడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు. ఈ వృత్తిలో ప్రమాదాలబారిన పడి, వైకల్యం పొందినవారు రాష్ట్రంలో 10వేల మందికి పైగానే ఉంటారు. ఎక్కేటప్పుడే తాళ్లను ఒక్కటికి పదిసార్లు సరిచూసుకోవాలి. మళ్లీ కిందకు దిగేంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా వేకువజామున, రాత్రి సమయాల్లో, వర్షాకాలం, చలికాలం, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.

ఆదాయమే పరమావధిగా భావిస్తున్న ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖను ప్రధాన వనరుగా ఎంచుకుంది. దీంతో ఎక్కడబడితే అక్కడే గ్రామాల్లో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ‘గతంలో పనులు చేసుకొని వచ్చే వారు అలసట మరచిపోవడానికి కల్లు తాగేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం బార్లు, వైనుషాపులకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుంది. పల్లెల్లో సైతం ఇవి గ్రామ నడిబొడ్డులో దర్శనమిస్తున్నాయి. దాంతో కల్లుకున్న ప్రాధాన్యం తగ్గిపోయింది. రోజంతా కష్టపడి తీసిన కల్లు పూర్తి స్థాయిలో అమ్ముకోలేకపోతుండటంతో కటుంబ పోషణభారమై గీత కార్మికులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Itha Kallu

హామీకే పరిమితమైన నీరా స్టాల్స్

గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరుపున హైదరాబాద్ లో నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తుంది. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దశల వారిగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాలను విస్తరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేస్తుందని, నీరా లైసెన్స్‌లు గౌడ కులస్థులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో తమ ఉపాధి మెరుగుపడుతుందని గీత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఏళ్లు గడుస్తుంది తప్ప హామీలు కార్యరూపం దాల్చలేదు. నీరాలోని ఔషధ గుణాలతో షుగర్, మధుమేహం, క్యాన్సర్, లివర్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

ఎక్స్ గ్రేషియాకు అడ్డంకిగా జీవోలు…

తెలంగాణ ప్రభుత్వం 26–03–2017న, జీవో నెం. 53 విడుదల చేసింది. వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.10వేలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. కానీ 14–07–2017న ప్రకటించిన 164 జీవోలో పెన్షన్‌ తీసుకున్నవారికి ఎక్స్‌గ్రేషియో వర్తించదని చెప్పారు. దీనికి తోడు చెట్టునుంచి చనిపోతే మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నట్లు పలు గీత కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

వృత్తిచేసే వారికి పెన్షన్‌ ఇస్తామని చెప్పి పెన్షన్‌ తీసుకుంటున్న వారికి ఎక్స్‌గ్రేషియో రాదనడం ఎంతవరకు సమంజసమని జీవోలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిబంధనలతో ప్రమాదం జరిగిన గీత కార్మికులకు అన్యాయం జరుగుతుందని, సభ్యుడై ఉండి వృత్తిలో ప్రమాదం జరిగితే ఎలాంటి షరతులు లేకుండా ఎక్స్‌గ్రేషియో వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రియల్టర్లుతో ఎఫెక్ట్…

అయితే, ఇటీవల రాష్ట్ర రాజధానితోపాటు ప్రముఖ నగరాల్లో, పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగిపోతోంది.’గతంలో పొలాల గట్ల వెంబడి, బీడు భూముల్లో ఎక్కడపడితే అక్కడ తాటి చెట్లు ఉండేది. భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిని ఇళ్ల ప్లాట్లుగా మార్చేందుకు గట్లపై ఉన్న తాటిచెట్లను నరికేస్తున్నారు. దీనికి తోడు మొగిపురుగు పడటంతో చెట్లు నానాటికి అంతరించి పోతున్నాయి.

ఉపాధి కరువవుతోంది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు, వృత్తిలో నైపుణ్యం తగ్గడం, ప్రభుత్వ భూములు, కొన్ని సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో చెట్లను పెంచుకునే అవకాశమున్నా గీత కార్మికులు ముందుకు రాకపోవడం వల్ల ఈత వనాలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. పంటల సాగుకోసం, భూస్వాములు ఈత చెట్లను తొలగించి వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. ప్రస్తుతం గీత కార్మికులకు మంజూరు ఉన్న ఈత చెట్లలో 20 శాతం కూడా లేకుండా పోయాయి.

అమలుకు నోచని 560 జీవో…

హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువు కట్టలపై మొత్తం 5 కోట్ల ఈత మొక్కలను నాటాలని నిర్ణయించింది. కానీ తూతూ మంత్రంగానే సాగింది.పాలసీలో 560 జీవో ప్రకారం సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్నది. ఇది అమలుకావడం లేదు. ప్రతి సొసైటీకి 5 నుండి 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చి ఒకవేళ లేనిచో కొనిచ్చి దానిలో హైబ్రిడ్‌ చెట్లు నాటి నీటి సౌకర్యం కల్పిస్తే గీతకార్మికులే వాటిని సంరక్షించుకుంటారు. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడతాయి.

Kallu Lotti

కార్పొరేషన్ కనుమరుగు

ప్రభుత్వానికి ఆది నుంచి పన్ను చెల్లించే వృత్తి గీత వృత్తి ఒక్కటే. చెట్టుపై హక్క కూడా ఉండేది. దానిని దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వాలు గీత కార్పొరేషన్ ను ఏర్పాటు చేశాయి. 1991లో చైర్మన్ గా 1991లో మాచర్ల జగన్నాథం, రెండో వ్యక్తి కటికం సత్తయ్యగౌడ్, మూడో వ్యక్తి నర్సాగౌడ్, మరో ఇద్దరు మాత్రమే పనిచేశారు. అనంతరం గీత కార్పొరేషన్ కు 12 ఏళ్లుగా చైర్మన్‌ను నియమించలేదు. ప్రస్తుతం ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రభుత్వాలు చిన్న చూపు చూడటంతో చైర్మన్ తో పాటు నిధుల కేటాయింపు జరుగడం లేదు. గీత కార్మికులను ఆదుకునేవారే కరువయ్యారు. కార్పొరేషన్ ఉన్నా లేనట్లేననే పలువురు గీత కార్మికులు ఆరోపిస్తున్నారు.

గీతకార్మికుల డిమాండ్లు ఇవే…

ఎక్సైజ్‌ టాడి పాలసీని ప్రకటించాలి. వీటికి సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలి. బెల్టుషాపులను ఎత్తేయాలి. ఎక్సైజ్‌ అధికారుల వేధింపులు ఆపాలి. అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులనిస్తూ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ఏరియాలో రద్దు చేసిన సొసైటీలను పునరుద్ధరించాలి. సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ట్యాంకుబండ్‌పై విగ్రహాన్ని నెలకొల్పాలి. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. జీఓ నెంబర్‌ 35 ప్రకారం అర్హులైన గీతకార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి. కూల్‌డ్రింక్స్‌గా నీరాను గుర్తించాలి. సబ్సిడీపై రుణాలివ్వాలి. ఖాదీ పరిశ్రమ కింద శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహార, ఆహారేతర ఉత్పత్తులను తయారు చేయించాలి. గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా చూడాలి.

పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

Maturi Balaraj Goud

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియాలను వెంటనే చెల్లించాలి. చనిపోయిన, పర్మినెంట్ వికలాంగులైన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ నిబంధన తొలగించి, సివిల్ సర్జన్ సర్టిఫికెట్ ఇస్తే ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. మామూలు గాయాలైన వారికి రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచాలి. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీకి ముందు నాయకులు, అనుభవాజ్ఞులతో ఎక్సైజ్ అధికారులతో చర్చించాలి. గీత కార్మిక కుటుంబాలకు న్యాయం చేసేలా చర్య తీసుకోవాలి.
– మాటూరి బాలరాజుగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం

560 జీవోను పకడ్బందీగా అమలు చేయాలి

Bommagani Prabhakar

ప్రభుత్వం తీసుకొచ్చిన 560జీవోను పకడ్బందీగా అమలు చేసి ఈత, తాటి చెట్ల పెంపునకు చర్యలు తీసుకోవాలి. నీరా స్టాల్స్ ఏర్పాటు చేయాలి. గీత కార్మికులకు ఖాదీగ్రామీణ శాఖ కింద ఆహార, ఆహారేతల ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వడంతో పాటు స్టై ఫయిండ్ ఇవ్వాలి. గీత కార్మికులకు వృత్తి ప్రొఫెషనల్ కింద పెన్షన్ ను రూ.6వేలు ఇవ్వాలి. కల్లును శీతల పానియంగా గుర్తించాలి. ఫామ్ కోలాగా గుర్తించాలి. కేరళ మాదిరిగా నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
-బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు, కల్లుగీత పనివారల సంఘం

Advertisement

Next Story

Most Viewed