ప్రభుత్వ భూముల కబ్జాకు టీఎస్ బీపాస్ పర్మిషన్..?

by Shyam |
ప్రభుత్వ భూముల కబ్జాకు టీఎస్ బీపాస్ పర్మిషన్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా వేసేందుకు తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్(టీఎస్-బీపాస్) మరో అవకాశాన్ని కల్పిస్తోంది. సింగిల్ విండో పర్మిషన్లకు అవకాశం కల్పిస్తూ ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-బీపాస్‌ను దుర్వినియోగం చేసేందుకు భవన నిర్మాణదారులు ప్రయత్నిస్తున్నారు. టీఎస్-బీపాస్ కింద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు ఫిబ్రవరి 21 నుంచి పది రోజుల్లో 720 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ​201 దరఖాస్తులు అందినట్టు గుర్తించిన అధికారులు తిరస్కరించారు. ఆన్‌లైన్ ద్వారా పర్మిషన్ పొందినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంలో ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేస్తామని, తప్పుడు సమాచారం ఇచ్చిన దరఖాస్తుదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం స్పందిస్తూ జీహెచ్ఎంసీకి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోనల్ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే సంస్కరణల ప్రక్రియ, నిర్మాణ కార్యకలాపాలకు సులభతరం చేసి అనుమతులను ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ విధానాన్ని కూడా దుర్వినియోగం చేస్తుండటాన్ని గమనించిన అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో 75 చదరపు అడుగుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ మీద రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులనిచ్చేందుకు టీఎస్ బీపాస్ వర్తించేది. ప్రస్తుతం ఈ పరిమితిని ఐదొందల చదరపు మీటర్ల వరకు విస్తరించారు. 75 చదరపు గజాల వరకు ప్లాట్ పరిమాణానికి తక్షణ అనుమతి ఇవ్వబడుతుంది. జీ+వన్ ఫ్లోర్ వరకూ(రెసిడెన్షియల్) నిర్మాణానికి భవనం అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం లేదు. దరఖాస్తుదారులు కేవలం ఒక్క రూపాయితో టోకెన్‌తో నమోదు చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed