ఆసరాపై సర్కార్ కీలక నిర్ణయం.. వారికి నో ‘పెన్షన్’

by Anukaran |   ( Updated:2021-07-05 23:07:22.0  )
Aasara Pension
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసరా ఆశలు మళ్లీ మొదలయ్యాయి. మూడేండ్ల కిందట.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మళ్లీ ఉప ఎన్నికకు ముందు యాదికొచ్చింది. గతంలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా ఇదే ప్రకటన వచ్చింది. కానీ మంజూరు కాలేదు. 2018 నుంచి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ రాలేదు. ప్రస్తుతం వచ్చేనెల నుంచి 57 ఏండ్ల వారికి కూడా పెన్షన్ మంజూరు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆసరాపై ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

పాత దరఖాస్తులకు మాత్రమే..

ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కోసం కొత్త దరఖాస్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ అర్హత ఉంటుందని, దీనిపై గ్రామస్థాయిలో పూర్తి విచారణ తర్వాతే మంజూరు చేయనున్నారు. 57 ఏండ్లు నిండిన వారితో పాటుగా 65 ఏండ్ల వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడం లేదు.

గత ఏడాది ఏప్రిల్​ నుంచే ఇస్తామన్నారు..

రాష్ట్రంలో కొత్తవారికి ఆసరా పెన్షన్లను పలు సందర్భాల్లో వాడుకుంటూనే ఉన్నారు. 2020, జనవరి 25న మున్సిపల్​ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్​మీడియా సమావేశంలో మాట్లాడారు. “ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మేం ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినం. కచ్చితంగా ఈ బడ్జెట్‌లో వారికి నిధులు పొందుపర్చి మార్చి 31 తర్వాత రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన ఆడ, మగ వారందరికీ వృద్యాప్య పింఛన్లు రూ. 2016 చొప్పున అందిస్తం. దాదాపు ఎంత మంది ఉన్నారో లెక్క కూడా తేలింది. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏప్రిల్ నుంచి వారికి పింఛన్లు అందిస్తం..’’ అప్పటి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని ఎదురుచూస్తున్న వారికి ఇంకా నిరాశే నెలకొంది. ఏండ్లు గడుస్తున్నా ఆసరా అందడం లేదు.

మూడేండ్ల నుంచి అంతే..

టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 57 ఏండ్లకే పెన్షన్​అర్హత వయస్సును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన అనంతరమే కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ, ఆసరా కింద లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ నేటికి కూడా ప్రారంభం కాలేదు. అనేక కారణాలను సాకుగా చూపిస్తూ ఇప్పటికే ఉన్న పింఛన్లలోనే కోత పెడుతున్నారు. ఈ సమయంలో కొత్త పింఛన్లు రావడం మరిచిపోవాల్సిందేనని అధికార వర్గాలు చెప్పుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 57 ఏండ్ల అర్హత వయస్సున్న వారు 8.62 లక్షల మంది కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వారిలో 6.62 లక్షల మంది అర్హులుగా ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఆ ఫైల్ పక్కన పడేశారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయలేదు.

ఎన్నికలప్పుడు మాత్రమే ప్రకటిస్తున్నారు..

రాష్ట్రంలో ఎన్నికల తాయిలాలుగా ఆసరా పింఛన్లు తయారయ్యాయి. గతేడాది దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లను ఇస్తున్నామని మంత్రి హరీశ్​రావు ఊరూరికి ఫోన్ చేసి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ఆడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కొత్త పెన్షన్లను ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మండలి ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ దీన్ని తెరపైకి తీసుకువచ్చారు. అప్పుడు రాష్ట్రంలో ఆసరా దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశించింది. కొత్త పెన్షన్లపై గంపెడాశలు పెట్టుకున్న వారంతా అదే సమమంలో దరఖాస్తులను పట్టుకుని తిరుగుతున్నారు. సాగర్​ఉప ఎన్నిక, మినీ పుర పోరు కోసమే అన్నట్టుగా ఆశ పెట్టి ఆ తర్వాత మర్చిపోయారు.

12.92 లక్షల దరఖాస్తులు.. రూ. 25.88 కోట్లు

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే 57 ఏండ్లకు పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చెప్పి, మేనిఫెస్టోలో కూడా పొందుపర్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత 2019 మే నెలలో పింఛన్ల సొమ్మును రెట్టింపు చేశారు. పింఛన్ల అర్హత వయస్సును 64 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వెంటనే దరఖాస్తులు కూడా తీసుకునేందుకు అధికారులకు సూచించారు. దీంతో గ్రామాలు, పట్టణాల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. అధికారులు కూడా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంతో మీ సేవా కేంద్రాల నుంచి అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల నుంచే ప్రభుత్వానికి రూ. 17.24 కోట్ల ఆదాయం వచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఒక్కో దరఖాస్తుకు రూ. 200 వసూలు చేశారు. మొత్తం 8.62 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. వీటితో పాటుగా 64 ఏండ్లు నిండిన వారి దరఖాస్తులు 4.3‌‌0 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో రూ. 8.64 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఆసరా దరఖాస్తులతోనే 25.88కోట్లు వచ్చాయి.

పద్దు కేటాయించినా.. కాగితాలకే..!!

కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చూపిస్తూనే ఉంది. పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు కాగితాలకే పరిమితం చేస్తోంది. పెన్షన్ల సొమ్ము రెట్టింపు చేసిన అనంతరం 2019లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అభాగ్యుల పెన్షన్ల కోసం రూ. 12,067 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2019-20 బడ్జెట్ సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టి బడ్జెట్‌లో రూ. 9,434 కోట్లు కేటాయించారు. అప్పటి వరకు రాష్ట్రంలో 38.72 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ తర్వాత 2020–21 మార్చి బడ్జెట్‌లో రూ. 11,758 కోట్లను కేటాయించారు. అనంతరం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38.50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా.. వీరిలో దివ్యాంగులు 4,93,975 మంది ఉన్నారు. వృద్ధ్యాప్య, వితంతు, నేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, బోధకాల వ్యాధిగ్రస్తులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలకు రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 3016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు.

ప్రకటనలకే పరిమితం

కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఇస్తామంటూనే సాగదీస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ వచ్చేనెల నుంచి 57 ఏండ్ల వారికి పెన్షన్ అంటూ ప్రకటించినా.. ఇంకా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది మార్చిలో మంత్రి దయాకర్​రావు కూడా 57 ఏండ్ల పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదేశాలు ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉంటే ఇప్పటికే గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి విచారణ మొదలుకావాల్సి ఉందని, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అధికారులు చెపుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లు ఇస్తామంటూ ఆశలు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed