ఇక ‘రియల్’ బూమ్

by Anukaran |   ( Updated:2020-09-27 21:17:50.0  )
ఇక ‘రియల్’ బూమ్
X

దసరా తర్వాతనే రిజిస్ట్రేషన్లు ఊపందుకోనున్నాయి. ఇంతకాలం చేతికి రాకుండా ఆగిపోయిన ఆదాయానికి రెట్టింపు మేరకు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికల్లా రాష్ట్రంలోని ప్రతీ అంగుళం భూమికి విలువను నిర్ణయించనుంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం, రెవెన్యూ విభాగం సిబ్బంది ఇప్పటికే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు. స్థానిక సంస్థల సహాయాన్నీ తీసుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని ప్రామాణికాలను కూడా రూపొందించారు. దీని ద్వారా భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంటుందని సర్కారు భావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సుమారు ఆరున్నర వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాన్ని రూ. 10 వేల కోట్లకు పెంచింది. భూమి విలువను ప్రభుత్వమే నిర్ణయించనుందని, సబ్ రిజిస్ట్రార్‌లు ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పినందున ఈసారి రెట్టింపు ఆదాయం అంటే, సుమారు రూ. 20 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. స్టాంపు డ్యూటీలో కూడా మార్పులు చేర్పులపై ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు శాతం స్టాంపు డ్యూటీ అమలవుతోంది.

భవిష్యత్తులో ఇది పెరిగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఆశించిన మేరకు ఆర్థిక సాయం అందకపోవడం, రాష్ట్రాల పరిధిలో ఉన్న పన్నుల వ్యవస్థ ఒక్కటొక్కటిగా కేంద్రం చేతికి పోతూ ఉండడంతో స్వీయ ఆర్థిక వనరుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రభుత్వం ఆ సాహసానికి పూనుకోవడంలేదు. వాహనాల పన్ను పెంచినా ఆ డబ్బులు ప్రభుత్వ అవసరాలకు పెద్దగా ఉపయోగపడడం లేదు. పెట్రోలు-డీజిల్ ఉత్పత్తులపై ఇప్పటికే గరిష్ట స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నందున ఇక పెంచే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల విలువను పెంచడం, ప్రభుత్వమే మార్కెట్ రేటును నిర్ణయించడం, నల్లధనం రూపంలో జరిగే లావాదేవీలతో జరిగే నష్టాన్ని నివారించడం ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

మొదలైన కసరత్తు

గ్రామ పంచాయతీ మొదలు మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయి వరకు ప్లాట్లు, ఇళ్ళు, దుకాణాలు, వ్యవసాయ భూములు…ఇలా ఒక్కో కేటగిరీకి అనుగుణంగా భూముల విలువను అధికారులు లెక్కిస్తున్నారు. నివాస స్థలాలు, ప్లాట్లు తదితరాలకు ప్రాంతాన్ని, వ్యవసాయ భూములకు సర్వే నెంబర్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పరిశ్రమలు, లేఔట్‌ తదితరాలకు రోడ్లను ప్రామా ణికంగా తీసుకుంటున్నారు. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులను, సాగునీటి కాలువలు, ఎండాకాలం కూడా నీరు పారే ప్రాంతాలు, భారీ పరిశ్రమలు ఇప్పటికే ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు, శివారు ప్రాంతాల విలువలను వేర్వేరుగా లెక్కిస్తున్నారు. దసరా పండుగ నాటికి ఎక్కడెక్కడ ఎంత రేటు అనేదానిపై ఒక స్పష్టత రానుంది. రహదారులకు ఆనుకుని ఉన్న స్థలాలకు కాస్త ఎక్కువ ధర, అక్కడి నుంచి 15 మీటర్లలో ఉన్న స్థలానికి ఇంకో ధర, ఇంకా లోపలికి ఉన్న ప్రాంతానికి మరికొంత తక్కువ ధర ఉండే అవకాశముంది. హైదరాబాద్ నగరానికి దారి తీసే రోడ్లకు సమీపంలో ఉండేవాటికి ఎక్కువ ధర, జిల్లా కేంద్రాలకు వెళ్లే రోడ్ల సమీపంలో ఉన్న స్థలాలకు మరో ధరను పరిశీలిస్తున్నారు.

ఇక ధరలు డైనమిక్

కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 ఏప్రిల్‌లో భూముల విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. ఇకపై ప్రభుత్వం నిర్ణయించే ధరలు ఎప్పటి కప్పుడు మారేలా ‘డైనమిక్’గా ఉండేలా ఆలోచిస్తోంది. ఈ నెలలో నిర్ణయించిన విలువ వచ్చే నెలలో మారిపోయే అవకాశం ఉంటుంది. కరోనా లాంటి పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఢోకా లేకుండా ఈ ‘డైనమిక్’ విధానం బాగా సాయం చేయనుంది. ప్రభుత్వానికి ఎప్పుడు ఆదాయం అవసరమైతే అప్పుడు భూముల విలువను పెంచే పద్ధతిని అవలంబించ నుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం నిర్ణయించిన విలువతో సంబంధం లేకుండా కొనుగోలుదారు, విక్రయదారుల భూమి విలువను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. దానికి తగినట్లుగా స్టాంపు డ్యూటీ కడుతున్నారు. ప్రభుత్వానికి తెలియకుండా ఇష్టమైన ధరలకు క్రయ విక్రయాలు జరుపుకుని ప్రభుత్వం నిర్ణయించిన విలువ మేరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగిలిన డబ్బును నల్లధనం రూపంలో మార్చుకుంటున్నారు. ప్రభుత్వమే విలువను పెంచడం ద్వారా వీలైనంతగా దీన్ని తగ్గించవచ్చన్నది కూడా మరో ఆలోచన.

Advertisement

Next Story