రాజ్యాంగమే మా కరదీపిక: మోడీ

by Shamantha N |
రాజ్యాంగమే మా కరదీపిక: మోడీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో మతం, కులం, భాషా, లింగంలపట్ల వివక్ష చూపదని, రాజ్యాంగమే తమ కరదీపిక అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం సర్కారు పాటుపడుతున్నదని తెలిపారు. రెవరెండ్ జోసెఫ్ మార్ తోమా 90వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కేరళ పథానమిట్టలో జరుగుతున్న వేడుకల్లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ ప్రభుత్వం సౌకర్యవంతమైన సర్కారు ఆఫీసుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోదని, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతాను కల్పించడమే దీనికి నిదర్శనమని అన్నారు. మార్ తోమా చర్చ్ జీసస్ అనుచరుడు సెయింట్ థామస్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. ఆయన అభిలాషతోనే భారతీయుల్లో మంచి మార్పును కాంక్షిస్తూ ఈ చర్చ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య, విద్యారంగాల్లో గణనీయమైన కృషి చేశారని ప్రశంసించారు. ఈ సమాజం, దేశ అభ్యున్నతి కోసం జోసెఫ్ మార్ తోమా తన జీవిత చరమాంకం వరకూ పాటుపడ్డారని తెలిపారు. పేదరిక నిర్మూలన, మహిళల సమస్యలను తొలగించడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు.

భారత్ ఎంతో ముందున్నది:

కరోనాపై పోరాటంలో భారత్ మిగతా దేశాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నదని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో కరోనా విలయం భారత్‌లో తీవ్రంగా ఉంటుందని చాలా మంది ఆందోళనలు వ్యక్తపరిచారని, కానీ, లాక్‌డౌన్ సహా పలు కట్టడి చర్యల ద్వారా భారత్ ఎంతో ముందున్నదని తెలిపారు. ఈ పోరాటాన్ని ప్రజలే ముందుండి సాగించారని, ఈ పోరు మంచి ఫలితాలనిచ్చిందని వివరించారు. భారత రికరవరీ రేటు క్రమంగా పెరుగుతున్నదని గుర్తుచేశారు. అయితే, ప్రజలు వైరస్‌పట్లా ఉదాసీనంగా వ్యవహరించవద్దని, తప్పకుండా మాస్కులు, శానిటైజర్ల వినియోగంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed