ఏకగ్రీవ పంచాయతీలకు అందని నిధులు  

by Anukaran |
ఏకగ్రీవ పంచాయతీలకు అందని నిధులు  
X

పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ నజరానా నేటికీ అందలేదు. ఎన్నికలు జరిగి రెండేండ్లు గడుస్తున్నా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ముందుగా ప్రకటించిన పారితోషికం నిధులు విడుదల చేయడం లేదు. సర్పంచ్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకుంటే తమ గ్రామాలు అబివృద్ధి చెందుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది.

దిశ,ధర్మపురి: ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఎన్నికలు పూర్తయి రెండేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉలుకుపలుకు లేదు. ఈ సారి ఏకగ్రీవ పంచాయతీకి నజరానను రూ. 10 లక్షలకు పెంచారు. దీంతో గ్రామాభివృద్ధికి పంతాలు పక్కనపెట్టి మూకుమ్మడిగా సర్పంచు, వార్డు సభ్యలను ఎన్నుకున్నారు. నజరానా ఇప్పటికీ అందక పోవడంతో ఆయా గ్రామాల్లో నిధుల కొరత వేధిస్తున్నది. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి స్తంభించిపోయింది.

రెండేండ్లు గడుస్తున్నా..

2019 జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరిలో పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సారి కొత్తగా ఉపసర్పంచుకు కూడా చెక్ పవర్ కల్పించారు. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని భావించిన ఏకగ్రీవ పాలకవర్గాలకు నిరాశే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత కరువవడంతో ప్రోత్సాహక నిధుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 3.36 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.

జగిత్యాల జిల్లాలో 36 ఏకగ్రీవం

గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.5లక్షలు నజరానాను ఇవ్వగా ఇప్పడు రూ.10 లక్షలకు పెంచారు. ఇవే కాకుండా మరిన్ని నిధులు ఇస్తమని కూడా ప్రకటించారు. దీంతో జగిత్యాల జిల్లాలో 36 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 36 గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 3.36 కోట్ల నిధులు రావాల్సి ఉన్నది. నిధులు రాకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నజరానాను అందజేయాలని సర్పంచులు కోరతున్నారు.

Advertisement

Next Story

Most Viewed