ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బంది కొరత

by Anukaran |   ( Updated:2020-07-25 11:59:49.0  )
ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బంది కొరత
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కరోనా వార్డుల్లో రోజువారీ పరిశుభ్రత మొదలు బాత్‌రూమ్‌లను శుభ్రం చేయడం, మెడికల్-బయో వేస్ట్ తరలింపుకు ఇబ్బంది ఏర్పడడంతో మనుషుల స్థానంలో ఎక్కువ పని జరిగే యంత్రాలను సమకూర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా నేపథ్యంలో చాలా మంది పారిశుద్ధ్య సిబ్బంది వైరస్ బారిన పడడం, మరికొద్దిమంది క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవడంతో సిబ్బంది కొరత సమస్య తీవ్రమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో ఇప్పుడు యంత్రాలను సమకూర్చుకోవడం ద్వారా పది మంది పనిని ఒక మిషన్‌తో చేయవచ్చని మంత్రి ఈటల రాజేందర్ ఒక అభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే యంత్రాలను కొనుగోలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా వారియర్లుగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులంతా కష్టపడుతున్నారని చాలామందికి వైరస్ సోకి క్వారంటెన్‌లో ఉండాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందన్నారు. వైరస్ ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఆసుపత్రులను శుభ్రం చేయడానికి చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని, వీటిని చేయడానికి మార్కెట్‌లో ఉన్న అత్యాధునిక యంత్ర పరికరాలను పెద్ద ఎత్తున వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీలైనంత తొందరలోనే కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఫ్లోర్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, బాత్‌రూమ్ క్లీనింగ్ తదితర అవసరాల కోసం పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని కొనుగోలుచేసి అన్ని ఆసుపత్రులకు అందజేస్తామన్నారు. ఐసీయూ వార్డుల్లో కూడా వీటినే వినియోగిస్తామని, పది మంది మనుషులు చేసే పనిని ఒక మిషన్ ద్వారానే చేయవచ్చన్నారు. వేగవంతంగా, ఎక్కువ నాణ్యతతో పని చేయగల సామర్థ్యం ఉన్న మిషనరీనీ కొనుగోలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న పరికరాలు కేవలం నేలను శుభ్రం చేయడానికి మాత్రమే పనికొస్తున్నాయని, కానీ గోడలని శుభ్రం చేసే మిషన్లు కూడా వచ్చినందున వాటిని కూడా వినియోగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో బాత్ రూం క్లీనింగ్ ప్రధాన సమస్యగా ఉందని, ఇలాంటిచోట్ల ఈ మిషన్ల ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల వ్యర్ధాలను తరలించడం కోసం కూడా ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కరోనా పేషంట్లు ఉన్న ఆసుపత్రిలో బయో మెడికల్ వేస్టులో అతి ఎక్కువ వైరస్ ఉండే ఆస్కారం ఉన్నందున ఆ వ్యర్ధాలను తరలించడానికి మనుషులకంటే మిషన్లను ఉపయోగించడమే శ్రేయస్కరమన్నారు. ఈ ఏర్పాట్లకు తోడుగా కోవిడ్ పేషంట్లకు నాణ్యమైన భోజనం అందిస్తున్నప్పటికీ పేషంట్ దాకా వెళ్ళేటప్పటికి చల్లారిపోతున్నాయని, వేడిగా ఉండేందుకు హాట్ ప్యాక్‌లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ రోగికి వేడివేడిగా భోజనం అందించవచ్చన్నారు.

Advertisement

Next Story