గ్రేటర్​లో ఉద్యోగుల ఓటు ఎటు..?

by Shyam |   ( Updated:2020-11-23 01:16:52.0  )
గ్రేటర్​లో ఉద్యోగుల ఓటు ఎటు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఏ లేదు. పీఆర్సీ మర్చిపోవడమే అవుతుంది. పదవీ విరమణ పెంచుతారంటే అదీ లేదు. బదిలీలు లేక రోజూ తిరగడమే సరిపోతోంది. గట్టిగా అడుగుదామంటూ సంఘాలు ముందుకు రావు. వచ్చినా ఆర్టీసీలో ఏం జరిగిందో కండ్లారా చూసినం. ఇప్పుడైనా ఉద్యోగుల సత్తా చూపించకుంటే వచ్చే రోజుల్లో ఉనికి కూడా ప్రశ్నార్థకమేనంటూ ఆసక్తికరమైన చర్చ గ్రేటర్​ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల పరిణామాలతో రాష్ట్రరాజకీయాల్లో మార్పులు వచ్చినట్లుగా వారు భావిస్తున్నారు. దుబ్బాకలో గెలుపుతో బీజేపీ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్​ ఎన్నికలు రావడంతో పార్టీలకు ప్రతిష్ఠాత్మకమయ్యాయి. ముందు నుంచి ప్లాన్​తో ఉన్న అధికార పార్టీ ప్రత్యర్థులు ఊపిరి తీసుకోని విధంగా గ్రేటర్​ ఎన్నికలకు దిగింది.

ఉద్యోగవర్గాలను దూరం పెట్టిన సర్కారు..!

ప్రస్తుతం ఉద్యోగ వర్గాల ఓట్లపై ఆసక్తి మొదలైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగవర్గాలను సీఎం కేసీఆర్​ దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చుతూ పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఉద్యమంలో ముందున్న ఉద్యోగ నేతలంతా ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మినహా ఉద్యోగ వర్గాలకు ప్రాధాన్యత లేదు. స్వామిగౌడ్​, దేవీప్రసాద్​, కారం రవీంద్​రెడ్డి సహా పలువురు ఏదైనా అవకాశం వస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అదేస్థాయిలో కిందిస్థాయిలో ఉద్యోగ సంఘాల నేతలపై అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల టీజీఓ అధ్యక్షురాలు మమత తన భర్తకు ఎక్స్​టెన్సన్​ ఇప్పించుకోవడం పెద్ద దుమారానికే దారి తీసింది. ఆ తర్వాత సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఉద్యోగుల పక్షాన ఒక్కరోజు వేతనం ఇవ్వడంపై కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. జేఏసీ తరఫున టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్​, ప్రతాప్​, టీజీఓ నుంచి మమత తదితరులు సీఎంను కలిసి చెక్కును అందించారు. అయితే జేఏసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రకటిస్తారని, చెక్కును ఎలా ఇస్తారంటూ తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.

ఎందుకివ్వాలి?

ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కనీసం ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడేందుకు కూడా సీఎం సమయం ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. పెండింగ్​లో మూడు డీఏలు ఉంటే ఇటీవల ఒక్కటే ఇవ్వడం, కరోనా లాక్​డౌన్​లో కోత పెట్టిన వేతనాలను విడతలుగా మంజూరు చేయడం, పీఆర్సీ అంశమే లేకపోవడంతోపాటు బదిలీలు కూడా చేయడం లేదు. బదిలీలు అవుతాయని కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి చాలా మంది ఉద్యోగులు స్వస్థలాల నుంచి కార్యాలయాలకు వచ్చి పోతున్నారు. దాదాపు హైదరాబాద్​ నుంచే లక్ష మంది ఉద్యోగులు రోజూ వచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు చేయకపోవడంతో వ్యతిరేకత ఎదురవుతోంది. పదవీ విరమణ పెంపు అప్పుడు, ఇప్పుడో అనుకున్నప్పటికీ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎందుకు మద్దతుగా ఉండాలి అంటూ ఉద్యోగులు ప్రశ్నించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్​ ఎన్నికల్లో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది.

ఎదురు పోలేమా…?

ఈ ఆరేండ్ల కాలంలో ఉద్యోగవర్గాలకు సంబంధించిన చాలా సమస్యలు పెండింగ్​లో ఉన్నాయి. దీనిపై ప్రభుత్వంతో పోరాడేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా లేవు. గతంలో ఉద్యోగ సంఘాల్లో ఉన్న పోరాట స్ఫూర్తి మొత్తానికి తగ్గిపోయింది. ఫలితంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించుకుంటూ వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం మరింత భయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో సంఘాలే లేకుండా పోయాయి. దీనిలో సీఎం విజయం సాధించారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి సమస్యలను సాధించుకోలేమనే ధోరణితో ఉద్యోగ సంఘాలున్నాయి. ఫలితంగానే సమస్యల పరిష్కారం కావడం లేదని కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆగ్రహం నెలకొంది. ఉద్యోగ సంఘాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయని కూడా సోషల్​ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

గ్రేటర్​లో 7.30 లక్షల ఉద్యోగుల ఓట్లు..

ప్రస్తుతం గ్రేటర్​ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. గ్రేటర్​లో ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లు 7.30 లక్షలు ఉంటాయని ప్రాథమిక అంచనా. దీనిలో పెన్షనర్ల ఓట్లు రెండు లక్షలకుపైనే. హైదరాబాద్​ జిల్లా పరిధిలో 50 వేల ఓట్లు, రంగారెడ్డి, మేడ్చల్​, వికారాబాద్​, యాదాద్రి జిల్లాల పరిధిలోని ఉద్యోగుల ఓట్లు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నట్లు చెబుతున్నారు. 8‌‌0 వేల నుంచి లక్ష మంది ఉద్యోగులు హైదరాబాద్​ నుంచి వచ్చీపోతున్నారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల ఓట్లు 7.30 లక్షలు ఉంటాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వీరి ఓట్లు ఎవరికి వేస్తారనేది సందేహంగా మారింది. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను పర్మినెంట్​ చేస్తామనడం, కనీస వేతనం ఇస్తామని ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో ఈ వర్గాలు కూడా ఆగ్రహంగానే ఉన్నాయి.

కమలం మైండ్​ గేమ్​..?

అధికార పార్టీ మినహా పలు పార్టీలు ఉద్యోగుల ఓట్ల కోసం మైండ్​ గేమ్​ మొదలు పెట్టాయి. దీనిలో భాగంగానే స్వామిగౌడ్​ను కలిసి చర్చించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందనే సంకేతాలు ఇస్తే కొంత లాభం జరుగుతుందని భావిస్తున్నారు. రెండేండ్ల నుంచి ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్న బేవరేజెస్​ కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్​ దేవీ ప్రసాద్​కు కూడా గాలం వేస్తున్నారు. అధికార పార్టీని నమ్ముకుంటే కష్టమేనని, బీజేపీలోకి వస్తే భవిష్యత్తు ఉంటుందంటూ ఆశ చూపుతున్నారు. ఇలా ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉండి, ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారితో చర్చలు పెడుతూ బీజేపీతో టచ్​లో ఉన్నారంటూ ప్రచారం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగైనా ఉద్యోగ వర్గాల ఓట్లు కమలం వైపు టర్న్​ అవుతాయని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed