పీఆర్సీ: ఊరించి.. ఉసూరుమనిపించారు

by Anukaran |   ( Updated:2021-01-27 01:23:05.0  )
పీఆర్సీ: ఊరించి.. ఉసూరుమనిపించారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చేదువార్తే. తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్​ నివేదిక ఉద్యోగుల ఆశలను మట్టిలో కలిపింది. మెరుగైన ఫిట్​మెంట్​ తీసుకువస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. బిశ్వాల్​ కమిషన్​ ఫిట్​మెంట్​ను 7.5 శాతానికి పరిమితం చేస్తూ సూచించింది. ఇక ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమే.

ఉద్యోగులు మాత్రం 63 శాతం ఇవ్వాలని అడిగారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 30 శాతం వరకు ఇస్తారని ఆశించారు. కనీసం 25 శాతం ఉంటుందని సంబురపడ్డారు. వేతన సవరణ కమిషన్​ దాదాపుగా 14 నుంచి 15 శాతం వరకు రికమెండ్​ చేసి ఉంటుందని భావించారు. 15 శాతం రికమెండ్​ చేస్తే సీఎం కేసీఆర్​కు విన్నవించుకుని కనీసం 30 శాతానికి తీసుకోవచ్చని ఊహల్లో ఉన్నారు. కానీ వేతన సవరణ కమిషన్​ మొదట్లోనే నీళ్లు చల్లింది. బేసిక్​ పే మీద 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇస్తే సరిపోతుందని నివేదికల్లో పొందుపర్చింది. ఇక ఇంక్రిమెంట్​ ఇంక్రీస్​ను ప్రతి మూడేళ్లకోసారి 2.33 శాతం చేయాలని సూచించింది. ఉద్యోగులు మాత్రం 3.36 శాతం అడిగారు. ప్రస్తుతం ఉన్నట్టుగానే 2018, జూన్​ నుంచి వర్తింపచేయాలని పేర్కొంది.

నివేదికలో ఉద్యోగులు సంబురపడే అంశం పదవీ విరమణ వయస్సు పెంపు. దీన్ని 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని సూచించారు. అదే విధంగా చైల్డ్ కేర్​ లీవ్‌ను మరో నెల రోజులు పొడగిస్తూ ప్రతిపాదనలు చేశారు. అంతే మినహా పాత అంశాలన్నీ కంటిన్యూ చేశారు. పీఆర్సీ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సీఎస్​ నేతృత్వంలోని త్రీమెన్​ కమిటీ నేడు భేటీ కానుంది. ఈ భేటీలో పలు అంశాలను చర్చించనున్నారు.

హెచ్​ఆర్​ఏ తగ్గించారు..

హెచ్​ఆర్​ఏను గణనీయంగా తగ్గిస్తూ పీఆర్సీ నివేదికల్లో పేర్కొన్నారు. ఇప్పుడున్న దాని ప్రకారం, కొత్త జిల్లాల ఏర్పాటుతో హెచ్​ఆర్​ఏ పెంచాలని ఉద్యోగులు విన్నవించారు. కానీ కమిషన్​ మాత్రం తగ్గిస్తూ సూచనలు చేసింది. ఇప్పటి వరకు 30, 30, 14.5, 12 శాతం హెచ్​ఆర్​ఏ ఉండగా.. పీఆర్సీ తొలి నివేదికలో మాత్రం 11, 13, 17, 24 శాతంగా సూచించారు. అడిషనల్​ హెచ్​ఆర్​ఏను రూ. 2 వేల నుంచి రూ. 2500కు పెంచాలని సూచించారు.

రిటైర్​మెంట్​ బెనిఫిట్​ రూ. 16 లక్షలు

రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​లో భాగంగా గ్రాట్యుటీ చెల్లింపుల్లో ప్రస్తుతం రూ. 12 లక్షలు చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ. 16 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. పెన్షనర్లు, వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చును రూ.30వేలకు పెంచాలని సూచించారు.

చైల్డ్ కేర్​ లీవును 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఒకవేళ అంగవైకల్యం ఉంటే రెండేళ్ల సెలవును వర్తింప చేయాలని, మొదటి ఏడాది 100 శాతం వేతనం, రెండో ఏడాది 80 శాతం వేతనం ఇవ్వాలని సూచించారు. మెడికల్​ బెనిఫిట్స్​లో భాగంగా పెన్షనర్లకు నెలవారీ అలవెన్స్​ను రూ. 350 నుంచి రూ. 600కు పెంచాలని ప్రతిపాదించారు. టీఏ చెల్లింపుల్లో ఆర్టీసీ, ప్రైవేట్​ ఏసీ బస్సుల ప్రయాణానికి అవకాశం కల్పించేందుకు సూచించారు.

ఇక పెట్రోల్​ కార్లకు కిలోమీటరుకు ఇప్పటి వరకు రూ. 13 ఉండగా.. రూ. 16కు, డీజిల్​ కార్లకు కిలోమీటరుకు రూ. 9 ఉండగా.. రూ. 14 చొప్పున, ద్విచక్ర వాహనాలకు ఇప్పటి వరకు రూ. 5 ఉండగా.. రూ. 6 చొప్పున టీఏ చెల్లించాలని, డీఏలో భాగంగా లాడ్జింగ్​ ఛార్జీలు రాష్ట్రంలో అయితే రోజుకు రూ. 800, రాష్ట్రం వెలుపల అయితే రూ. 1300 చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు. ఎఫ్​టీఏ చెల్లింపుల్లో భాగంగా ఒకే మండల పరిధి అయితే రూ. 1200 నుంచి రూ. 1500కు పెంచాలని, రెవెన్యూ డివిజన్​ పరిధి అయితే రూ. 1500 నుంచి రూ. 2000కు పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు చెల్లించే సొమ్మును రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచేందుకు ప్రతిపాదించారు.

భారం రూ. 2252 కోట్లు

ప్రస్తుతం వేతన సవరణ కమిషన్​ సూచించిన ప్రతిపాదనలు, 7.5 శాతం నుంచి 10 శాతం ఫిట్​మెంట్​ ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై ప్రతిఏటా రూ. 2,252 కోట్లు అదనపు భారం పడుతుందని వేతన సవరణ కమిషన్​ నివేదికల్లో పేర్కొంది. సర్వీసు ఉద్యోగస్తుల కేటగిరీలో ఫిట్​మెంట్​ కింద రూ. 1,271 కోట్లు, హెచ్​ఆర్​ఏ కింద రూ. 135 కోట్లు, ఇతర అలవెన్స్​ల కింద రూ. 170 కోట్లు అదనంగా చెల్లించాలని సూచించారు. అదే విధంగా పెన్షనర్ల విభాగంలో పెన్షన్లు, ఫిట్​మెంట్​ కింద రూ. 600 కోట్లు, మెడికల్​ అలవెన్స్​ల కింద రూ. 75 కోట్లు ఉందని, మొత్తం రూ. 2,252 కోట్లు ప్రతిఏటా ప్రభుత్వంపై అదనపు భారం ఉంటుందని నివేదికల్లో వెల్లడించారు.

ఇక సర్కారుదే నిర్ణయం

ప్రస్తుతం ఉద్యోగుల చూపు మొత్తం సర్కారు ప్రకటన కోసం చూడాల్సి ఉంటోంది. ఎందుకంటే పీఆర్సీ నివేదిక రావడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో త్రీమెన్​ కమిటీ చర్చించనున్నారు. అనంతరం రేపు లేదా ఎల్లుండి సీఎం కేసీఆర్​తో సమావేశం అయ్యేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధంకానునన్నారు. సీఎం కేసీఆర్​తోనే చర్చిస్తేనే మెరుగైన ఫిట్​మెంట్​ వస్తుందని భావిస్తున్నారు.

ఎంతిస్తారు..?

వాస్తవంగా వేతన సవరణ కమిషన్​ ఎప్పుడైనా ఫిట్​మెంట్​ను తక్కువగానే ప్రతిపాదిస్తోంది. గతంలో కూడా 14 శాతమే సూచించింది. కానీ సీఎం కేసీఆర్​ మాత్రం 43 శాతం ప్రకటించారు. ఈసారి కూడా అదే ప్లాన్​ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వేతన సవరణ కమిషన్​ ఫిట్​మెంట్​ను తక్కువ చూపించినా.. తాము ఎక్కువగా ప్రకటించామని ఉద్యోగ వర్గాలను మచ్చిక చేసుకునేందుకే సీఎం ప్లాన్​ అంటూ ఉద్యోగ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫిట్​మెంట్​ ఎంతిస్తారనే అంశంపై ప్రధాన చర్చ జరుగుతోంది. కనీసం 30 శాతం పైమేరకు ఇవ్వాలని ఉద్యోగులు అంటుండగా.. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కనీసం 25 శాతమైనా ఇప్పించుకోవాలని అనుకుంటున్నారు.

ఉద్యోగుల సమావేశానికి కొత్త వ్యూహం

మరోవైపు ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్​ ఆధ్వర్యంలోని త్రీమెన్​ కమిటీ భేటీ అవుతోంది. దీనిలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి అందరినీ పిలిస్తే అందరూ ఏకతాటిపై ఉంటారని వారిని విభజించు.. పాలించు తరహాలో చర్చలకు పిలువనున్నారు. ఒక సంఘం నుంచి కనీసం నలుగురిని పిలువనున్నారు. ఇలా ఒక సంఘానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించనున్నారు. ఒకేసారి అన్ని సంఘాల నేతలను రమ్మనడం లేదు. ఎందుకంటే ఫిట్​మెంట్​పై అందరూ ఒకే మాట మాట్లాడితే ఇబ్బందులుంటాయని భావిస్తున్నారు. ఇలా ఒక సంఘాన్ని వేర్వేరుగా పిలిచి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఫలానా సంఘం 10 శాతం ఫిట్​మెంట్​కే ఒప్పుకుందని, ఇంకో సంఘం 8 శాతం అయినా చాలందని ఉద్యోగ సంఘాలను మెప్పించేందుకు అధికార కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed