270 కోట్ల 'బ్యాడ్ యాడ్స్‌'ను తొలగించిన గూగుల్!

by Harish |
270 కోట్ల బ్యాడ్ యాడ్స్‌ను తొలగించిన గూగుల్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2019లో మొత్తం 270 కోట్ల తప్పుడు ప్రకటనలను తొలగించాలని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇటీవల ‘గూగుల్: బ్యాడ్ యాడ్స్ రిపోర్ట్’ అనే నివేదిక ఈ వివరాలను అందించింది. నిబంధనలను ఉల్లంఘించిన తప్పుడు ప్రకటనలను తొలగించి, బ్లాక్ చేశామని గూగుల్ వెల్లడించింది. అంతేకాకుండా, సుమారు 10 లక్షల ప్రకటన కర్తల అకౌంట్లను సస్పెండ్ చేశామని స్పష్టం చేసింది. గూగుల్ సంస్థ 12 లక్షలకు పైగా అకౌంట్లను రద్దు చేసింది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన 2.1 కోట్ల వెబ్ పేజీల నుంచి ప్రకటనలను తొలిగించామని పేర్కొంది. యూజర్లు తప్పుడు ప్రకటనల వలలో చిక్కకుండా చర్యలు చేపడుతున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గత కొద్ది వారాలుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫేస్‌మాస్కులు, నివారణ మందుల పేరుతో మోసపూరిత ప్రకటనలు పెరిగాయని వాటిని గుర్తించినట్టు గూగుల్ పేర్కొంది.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో 3.5 కోట్ల ఫిషింగ్ ప్రకటనలను తొలగించామని, ఇటువంటి మోసాలు దాదాపు 50 శాతం తగ్గినట్టు గూగుల్ వెల్లడించింది. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచే ఇటువంటి మోసపూరిత ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు గూగుల్ వివరించింది. దీనికోసం కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ 24 గంటలూ పని చేస్తోందని తెలిపింది. గూగుల్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించే ప్రకటన కర్తల అకౌంట్లను పూర్తిగా తొలగిస్తున్నట్టు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ తన బ్లాగ్‌లో వివరించారు.

Tags: Google, Technology, blocked accounts, bad ads in google, remove bad ads

Advertisement

Next Story

Most Viewed